మన మతం భారత్.. మత గ్రంథం రాజ్యాంగం
భిన్నత్వమే బలం
దీనిని పరిరక్షించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
అన్ని మతాలు, వర్గాల సంక్షేమం మా లక్ష్యం
రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన లేదు
లోక్‌సభలో రాజ్యాంగ దినోత్సవ చర్చకు ప్రధాని సమాధానం
న్యూఢిల్లీ: ‘‘మా ప్రభుత్వం విశ్వసించే ఏకైక ధర్మం ‘మొదట భారత్ (ఇండియా ఫస్ట్)’.. ఏకైక ధర్మ గ్రంథం ‘రాజ్యాంగం’. దేశంలోని అన్ని వర్గాలు, మతాలకు చెందిన ప్రజల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వైవిధ్యతే భారత్ బలమని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘మన దేశంలో 12 మతాలున్నాయి. 122 భాషలున్నాయి. 1,600 మాండలికాలున్నాయి. దేవుడిని నమ్మేవారున్నారు.. నమ్మనివారున్నారు. అందరికీ సమాన న్యాయం అందాలి. అంతా సామరస్యంగా ఉండాలి’ అని ఆకాంక్షించారు. రాజ్యాంగ దినోత్సవం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంత్యుత్సవం సందర్భంగా గురు, శుక్రవారాల్లో లోక్‌సభలో జరిగిన చర్చకు మోదీ సమాధానమిచ్చారు. అనంతరం, రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ సహా రాజ్యాంగ నిర్మాతల కృషిని ప్రశంసిస్తూ సభ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దాదాపు 70 నిమిషాల పాటు ప్రసంగించిన మోదీ.. విపక్షాలతో రాజీ ధోరణిని ప్రదర్శించడం విశేషం.
రాజ్యాంగ సమీక్షకు గాని, రాజ్యాంగాన్ని మార్చేందుకు కానీ తన ప్రభుత్వం ప్రయత్నించబోదని, మెజారిటీ ఆధారంగా కాకుండా ఏకాభిప్రాయం ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తదితర నేతలు పోషించిన పాత్రను ఎన్డీయే ప్రభుత్వం తక్కువ చేస్తోందన్న కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో.. తన ప్రసంగంలో పలుమార్లు నెహ్రూ, గాంధీ, అంబేద్కర్‌ల కృషిని ప్రస్తావించారు. కాగా, చర్చ ఆసాంతం ప్రతిపక్షాలు లేవనెత్తిన అసహన ఘటనలను కాని, వాటికి సంబంధించిన చర్చను కానీ మోదీ ప్రస్తావించలేదు. ‘ఈ దేశం రాజ్యాంగం ఆధారంగా నడుస్తోంది. అలానే నడవాలి. ఇది భారత్ ప్రాథమిక సైద్ధాంతిక భావన. సంక్షోభాలు తలెత్తిన ప్రతీసారీ.. వాటిని పరిష్కరించడానికి అవసరమైన సమర్ధత, చేతనను పొందగల అంతర్గత శక్తిని తన శతాబ్దాల ప్రస్థానంలో భారత్ సమకూర్చుకుంది.
వసుధైక కుటుంబం(ప్రపంచమంతా ఒకటే కుటుంబం), అహింసా పరమో ధర్మః(అహింసే అత్యున్నత విధి), సర్వ ధర్మ సంభావ(అన్ని మతాలకు సమాన గౌరవం) అనే భావనలు భారత్ దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తాయి’ అని మోదీ విశ్లేషించారు. ‘వేలాది ఏళ్ల ప్రస్థానంలో ఎన్నోసార్లు సమస్యలు వచ్చాయి. సంక్షోభాలు వచ్చాయి. అదే సమయంలో వాటి పరిష్కారాలు కూడా ఇదే సమాజంలో ఉద్భవించాయి. దానికదే సరిదిద్దుకునే ప్రక్రియ తరహా విధానమది. అదే మన బలం’ అన్నారు. కులమతాలకు అతీతంగా అందరికీ సాధికారత కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉంటాం
రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉంటామని లోక్‌సభ తీర్మానించింది. రాజ్యాంగ పవిత్రతను, సర్వోన్నతను కాపాడుతామని స్పష్టం చేసింది. రాజ్యాంగ వ్యవస్థల స్వేచ్ఛను, అధికారాన్ని గౌరవిస్తామని పేర్కొంది. స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘దేశ సార్వభౌమత, ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక భావనలను పరిరక్షిస్తాం. ప్రజా జీవితంలో జవాబుదారీతనానికి, పారదర్శకతకు, నైతికతకు కట్టుబడి ఉంటాం. బలమైన గణతంత్రదేశ నిర్మాణ లక్ష్యానికి, సమానత్వం, సామాజిక న్యాయాలకు అంకితమవుతాం’ అని ప్రమాణం చేసింది. ‘సభ్యులకు తొలుత ఇచ్చిన తీర్మాన ముసాయిదాలో లౌకిక, సామ్యవాద పదాలు లేవు. దీనిపై కాంగ్రెస్, తృణమూల్ సహా పలు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయ’ని విపక్షానికి సంబంధించిన వర్గాలు వెల్లడించాయి.
వేలాది ఏళ్ల ప్రస్థానంలో ఎన్నోసార్లు సమస్యలు వచ్చాయి. సంక్షోభాలు వచ్చాయి. అదే సమయంలో వాటి పరిష్కారాలు కూడా ఇదే సమాజంలో ఉద్భవించాయి. దానికదే సరిదిద్దుకునే ప్రక్రియ తరహా విధానమది. అదే మన బలం. - ప్రధాని మోదీ