జాతి గీతకు జేజేలు
రాజ్యాంగమనేది కేవలం సమున్నత ఆశయ ప్రకటన మాత్రమే కాదు...అది త్రికర ణశుద్ధిగా ఆచరించి సాధించాల్సిన లక్ష్యాల కూర్పు. పాలకులు మొదలుకొని రాజకీయ పక్షాల వరకూ అందరికందరూ ఈ స్ఫూర్తిని మరిచారన్న ఆవేదన వ్యక్తమవు తున్న దశలో రాజ్యాంగంపై లోక్‌సభ రెండురోజుల ప్రత్యేక సమావేశాలు నిర్వహిం చుకుంది. గురు, శుక్ర వారాలు సాగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరిత ప్రసంగం ముగింపు పలికింది. రాజ్యాంగ దినోత్సవాన్నీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతినీ పురస్కరించుకుని ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేశారు. ‘మనం రాజకీయ సమానత్వాన్ని సాధించాంగానీ... సామాజిక, ఆర్ధిక జీవితంలో అత్యధికులకు దాన్ని నిరాకరిస్తున్నాం. ఈ వైరుధ్యాన్ని సాధ్యమై నంత త్వరగా పరిష్కరించకపోతే ఈ అసమానతల కారణంగా బాధలకు లోనయ్యేవారు రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ధ్వంసం చేస్తార’ని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949లోనే హెచ్చరించారు.
ఈ అరవై అయిదేళ్ల అనుభవాలనూ సింహావలోకనం చేసుకుంటే అందులో గర్వకారణమైనవీ ఉన్నాయి. ఆవేదనకు గురిచేసే అపజయాలూ ఉన్నాయి. ఇందులో అపజయాల శాతమే అధికం. ఈ రెండు రోజుల సమావేశాలూ వీటిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉండగా.... పరస్పర నిందలూ, ఎత్తిపొడు పులూ, స్వోత్కర్షలూ, స్వీయ సమర్థనలే ఎక్కువ భాగం ఆక్రమించాయి. మనం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితినుంచి విముక్తులమై అందులో స్వయం సమృద్ధిని సాధించేంతగా ఎదిగాం. కానీ గత కొన్నేళ్లుగా వ్యవసాయ రంగం కొడిగడుతోంది. పాలకులు ఉద్దేశపూర్వకంగా దాని పీక నొక్కుతున్నారు. ఆరుగాలం శ్రమించే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక, రుణాల ఊబిలో చిక్కుకుని చావే శరణ్యమనుకుంటున్నాడు. అన్ని రంగాల్లోనూ ఉత్పత్తి చేసినవారే ధర నిర్ణయిస్తుండగా తాను మాత్రమే అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఎందుకున్నాడో అర్ధంకాక క్షోభిస్తున్నాడు.
వృద్ధిరేటు పైపైకి పోతున్నా సంపదంతా కొద్దిమందికీ... నిష్ట దరిద్రం అత్యధికులకూ ఎందుకు మిగులు తున్నదో నిరుపేదలకు తెలియడం లేదు. విద్యా హక్కు చట్టం తెచ్చి అయిదేళ్లు దాటుతున్నా చెట్ల కింది చదువులు, మౌలిక సదుపాయాల లేమి ప్రాథమిక విద్యారంగాన్ని పీడిస్తున్నాయి. కేవలం మరుగుదొడ్లు లేని కారణంగా బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఎందరో ఆడపిల్లలు చదువుకు స్వస్తి చెబుతున్నారు. ఇదే ఇంత అధ్వాన్నంగా అమలవుతుంటే రేపో మాపో వస్తుందనుకుంటున్న ఆరోగ్య హక్కు చట్టం ఒరగబెట్టేదేమిటని అందరూ నిట్టూరుస్తున్నారు. వచ్చే అయిదేళ్లలో ప్రజారోగ్యానికి జీడీపీలో 2.5 శాతాన్ని కేటాయిస్తామని జాతీయ ఆరోగ్య ముసాయిదా ఘనంగా చెబుతున్నా...ఒక శాతంమించి ప్రజారోగ్యానికి వెచ్చిం చడం సాధ్యంకాదు గనుక ఆ లక్ష్యాన్ని సవరించుకొమ్మని నీతి ఆయోగ్ కోరుతోంది! శిశు మరణాల రేటు గతంతో పోలిస్తే తగ్గిన మాట వాస్తవమే అయినా సాధిం చాల్సిన లక్ష్యంలో అది చాలా తక్కువ. ఆడవాళ్లు ఎలా ఉండాలో, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నవారు అందుకు కులాలనూ, మతాలనూ తోడు తెచ్చుకుంటున్నారు.
చట్టబద్ధ పాలనకు సమాంతరంగా ఖాప్ పంచాయతీలు, కుల పంచాయతీలు శాసిస్తున్నా ఆయా వర్గాల్లో ఓట్లు కోల్పో తామన్న భయంతో రాజకీయ పార్టీలు నోరుమెదపని దుస్థితి నెలకొంది. అభివృద్ధి పేరుతో పంట పొలాలు బలవంతంగా లాక్కోవడం, ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ వనరులను బహుళజాతి కార్పొరేషన్లకు కట్టబెట్టే ప్రయత్నాలు జోరందుకున్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ఎన్నదగిన విజయాలన్నిటినీ ఈ అపజయాలు మసకబారుస్తున్నాయి. చట్టసభల్లో చర్చించి, ఆమోదించనిదే ఏదీ అమలు కాకూడదన్న రాజ్యాంగ నియమాన్ని ఉల్లంఘించి ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌ల బాటను ఎంచుకుంటున్నాయి.
భిన్నత్వంలో ఏకత్వమని మురియడం తప్ప దాన్ని సహించే తత్వాన్ని కోల్పో తున్న జాడలు ఇటీవలికాలంలో ఎక్కువయ్యాయి. వ్యక్తి స్వేచ్ఛ, అసమ్మతి వంటివి పాలకులకు పంటికింది రాళ్లవుతున్నాయి. అంబేడ్కర్ ఎన్నో అవమానాలకూ, వివక్షకూ గురైనా ఈ దేశాన్ని వదిలి వెళ్లాలని ఎన్నడూ ఆలోచించలేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనడంలో అతిశయోక్తేమీ లేదు. రాజ్యాంగం రూపుదిద్దుకుంటున్న సమయంలోనే... ప్రాచీన భారతీయ విలువలు, మనుధర్మ సూత్రాల స్ఫూర్తికి బదులు బ్రిటన్, అమెరికా, కెనడా తదితర దేశాల రాజ్యాంగం లోని అంశాలే అందులో ఎక్కువున్నాయని విమర్శించినవారున్నారు.
అంబేడ్కర్, ఆయనతోపాటు రాజ్యాంగ నిర్ణాయక సభ సభ్యులందరూ వీటన్నిటినీ తట్టుకుని కర్తవ్య నిష్టతో తమ బాధ్యతను నిర్వర్తించారు గనుకనే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికలుగా ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. రాజ్యాంగం రాసేనాటికి అందులో లౌకికవాదం, సమానత్వం లేవని రాజ్‌నాథ్ ఎత్తిచూపితే....అప్పట్లో చేర్చడం అంబేడ్కర్‌కు సాధ్యపడలేదని మల్లికార్జున్ ఖర్గే జవాబిచ్చారు. ఆ పదాలు మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైనవా, కాదా అన్నదే గీటురాయి. అనుగుణమైనవేనని రాజ్‌నాథ్ కూడా ఒప్పుకున్నారు గనుక ఈ విషయంలో వాదన అనవసరం.
అందరి ప్రసంగాలూ ఒక ఎత్తయితే నరేంద్ర మోదీ ప్రసంగం మరో ఎత్తు. అన్ని వర్గాలూ, మతాలకూ చెందిన ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయనిచ్చిన హామీ ...వైవిధ్యతే భారత్ బలమని, దాన్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయమూ ఈమధ్య కాలంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బీజేపీ, సంఘ్ పరివార్ నేతల కళ్లు తెరిపిం చాలి. ప్రథమ ప్రధాని నెహ్రూను విస్మరిస్తున్నారన్న విమర్శలను కూడా ఈ ప్రసంగం ద్వారా మోదీ పూర్వపక్షం చేయడానికి ప్రయత్నించారు. ప్రభుత్వం విశ్వసించే ఏకైక ధర్మ గ్రంథం రాజ్యాంగమేనన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉంటామని, దాని పవిత్రతనూ, ఔన్నత్యాన్నీ కాపాడతామనీ...ప్రజా జీవితంలో పారదర్శకతకూ, నైతికతకూ కట్టుబడి ఉంటామనీ లోక్‌సభ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానం కారుచీకటిలో కాంతి రేఖలా కనబడుతోంది. దాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తే జాతి భవిత దివ్యంగా ఉండగలదనడంలో సందేహం లేదు.