పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనున్న జనతాదళ్ (యు) నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను వదిలేసి ఆర్జేడి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌నే ఎందుకు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ? జైలు పక్షి నీతులు వల్లిస్తున్నారని, బీహార్‌నే జైలుగా మార్చాలని చూస్తున్నారంటూ ఆయనపైనే తన విమర్శనాస్త్రాలను ఎందుకు గుప్పిస్తున్నారు ? జేడీయు కన్నా బీజేపీ విజయావకాశాలను దెబ్బతీసే శక్తి లాలూ పార్టీయేనని ఆయన గ్రహించడం, గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ కూడా ఈ విషయాన్నే సూచించడమే అందుకు కారణం.
2010లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 91 సీట్లు గెలుచుకోగా, అందులో 29 సీట్లను వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కైవసం చేసుకుంది. మరో 13 సీట్లలో వరుసగా రెండోసారి (2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో) విజయం సాధించింది. ఈ మొత్తం 42 సీట్లలో మెజారిటీ స్థానాల్లో బీజేపీ 15 వేలలోపు ఓట్ల మెజారిటీతోనే గెలిచింది. ఇందులో మెజారిటీ స్థానాల్లో లాలూ నాయకత్వంలోని ఆర్జేడీ పార్టీ గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలవగా, మిగతా స్థానాల్లో అప్పడు ఆర్జేడీ మిత్ర పక్షంగా పోటీ చేసిన రాంవిలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ గట్టి పోటీతో రెండో స్థానంలో నిలిచింది.
బీజేపీ వరుసగా మూడుసార్లు విజయం సాధించిన 29 సీట్లలో 2010 ఎన్నికల్లో 13 సీట్లలో ఆర్జేడీ రెండోస్థానంలో గట్టి పోటీ ఇచ్చింది. వీటిలో 9 స్థానాల్లో బీజేపీ 15 వేలలోపు ఓట్ల తేడాతోనే గెలిచింది. మిగతా 16 స్థానాల్లో లోక్ జనశక్తి పార్టీ రెండో స్థానంలో నిలిచింది. బీజేవీ వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 13 సీట్ల విషయంలోకూడా ఫలితాల తీరు ఇలాగే కొనసాగింది. పది సీట్లలో ఆర్జేడీ రెండో స్థానంలో నిలిచింది. వీటిలో ఐదు స్థానాల్లో పదివేలకు తక్కువ ఓట్ల తేడాతోనే బీజేపీ విజయం సాధించింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆర్జేడీ బలానికి, జేడీయూ, కాంగ్రెస్ బలాలు కూడా తోడవ్వడంతో లాలూ పార్టీ నుంచే బీజేపీకి పోటీ ఎక్కువగా ఉంటుందని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ, లాలూను టార్గెట్ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చూసిన మోదీ, తన వ్యక్తిగత ఇమేజ్‌ని పణంగా పెట్టి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలన్న తాపత్రయంతో లక్షా పాతిక వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సృష్టించుకున్న లాలూకు కూడా బీహార్‌లో ఫాలోయింగ్ ఎక్కువే.
బీహార్ రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను ఆర్జేడీ వంద స్థానాలకు, జేడీయూ మరో వంద స్థానాలకు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలకు పోటీ చేస్తోంది. బీజేపీ 160 స్థానాలకు పోటీ చేయాలనుకుంటోంది. మిగతా స్థానాలను లోక్ జనశక్తి లాంటి ఎన్డీయే మిత్ర పక్షాలకు వదిలేయాలనుకుంటోంది.