
రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేసిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు.
న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లుగా పార్లమెంట్ ఫలప్రదమైన చర్చలు జరగాలని మోదీ అన్నారు. అయితే సభలో జరుగుతున్న పరిణామాల పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ప్రతిపక్షాల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
బిల్లులు పాస్ కావడంలో ప్రతిపక్షాలు సహకరించాలని మోదీ విఙ్ఞప్తి చేశారు. సభలో ప్రొసీజర్ను అనుసరిస్తే చర్చలు ఫలప్రదమౌతాయన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. పార్లమెంట్లో ఓ ప్రధానిలా కాకుండా మెదటిసారి సభలోకి వచ్చిన ఓ వ్యక్తిలా తన భావాలని వెల్లడించాలని భావిస్తున్నాని మోదీ తెలిపారు. పార్లమెంట్ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు. బిల్లులు ఆమోదించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని మోదీ అన్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోజు సభలో మహిళలే మాట్లాడాలని ఆయన పేర్కొన్నారు.
కాగా కేంద్ర మానవవనరుల సహాయమంత్రి రామ్ శంకర్ కటారియా వివాదాస్పద వ్యాఖ్యలపై పార్లమెంట్లో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడాలని కాంగ్రెస్ భావిస్తోంది. కటారియా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాజ్యసభలో తీర్మాణం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సీపీఐ నేత రాజా పిలుపునిచ్చారు.