న్యూఢిల్లీ : సుదీర్ఘ వాదనలు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు విచారణను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అమరావతిలో పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఎన్జీటీలో పిటిషన్ దాఖలఐన విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తున్నారని, కృష్ణానది వరద, కొండవీటి వాగుతో రాజధానికి ముప్పు ఉందని, లంక గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించి, బహుళ పంటలు పండే భూములు నాశనం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది సంజయ్ పరేఖ్ వాదనలు వినిపించారు.
రాజధాని ఎంపికకు ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా అమరావతిని ఎంపిక చేసిందన్నారు. 13,500 ఎకరాల్లో వరద ముంపు ఉంటుందని ఈఐఏ నివేదిక చెబుతోందని, అందులో 10 వేల ఎకరాల్లో రాజధాని ప్రాంతం ఉందన్నారు. 2.17 మీటర్ల ఎత్తులో ఉన్న లోతట్టు ప్రాంతాన్ని, 25 మీటర్ల ఎత్తు వరకూ పెంచుతామంటున్నారంటూ రాజధాని ప్రాంత మ్యాపులను చూపించి లోతట్టు ప్రాంతాల గురించి న్యాయవాది సంజయ్ వివరించారు. సారవంతమైన పంట భూముల్లో రాజధాని నిర్మిస్తున్నారని, ఇవన్నీ వేల సంవత్సరాల ప్రవాహాల కారణంగా సారవంతమైన నేలలుగా ఏర్పడ్డాయన్నారు. చాలా విలువైన ప్రకృతి సంపదలు ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు.
అనేక షరతులతో పర్యావరణ అనుమతులు ఇచ్చారని, కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ ప్రాంతంలో రాజధాని తగదని తేల్చిందని, నదీ ప్రవాహ గతిని రాజధాని నిర్మాణాలు దెబ్బతీస్తాయని పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా ట్రిబ్యునల్ దృష్టికి తీసుకు వెళ్లారు. అలాగే మానవాళికి ఇది తిరిగి పూడ్చలేనంత నష్టాన్ని కలిగిస్తుందని, లంక గ్రామాల్లో ఉన్న ప్రజల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. 13 లంకల్లో ఏడు గ్రామాలున్నాయని, జనం కూడా నివాసం ఉంటున్నారన్నారు. కృష్ణానదికి ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తుంటారని, రాజధాని ప్రాంతం భూకంప ముప్పు జోన్లో ఉందన్నారు. అలాగే రాజధాని ప్రాంతానికి రెండువైపుల నుంచి వరద ముప్పు పొంచి ఉందన్నారు.
కాగా రాజధాని ఎత్తును పెంచుతున్నారా అన్న ట్రిబ్యునల్ ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏకే గంగూలీ అటువంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. లంక గ్రామాలన్నీ ప్రభుత్వ భూములేనని ఆయన వాదించారు. అంతేకాకుండా లంక గ్రామాల్లో ప్రజలు అక్రమంగా నివాసం ఉంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ కేసు విచారణకు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ హాజరయ్యారు. అయితే రాజధాని ప్రాంత ఎత్తు పెంపు విషయం తనకు తెలియదని ఆయన చెప్పడం గమనార్హం.