సోనియా, రాహుల్ కు ఊరట..
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. వీరిద్దరూ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కానక్కర్లేదని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు తెలిపింది. సోనియా, రాహుల్ సహా మరో ముగ్గురికి ఈ మినహాయింపును ఇస్తున్నట్లు పాటియాలా హౌజ్ కోర్టు ప్రకటించింది.
గతంలో ఇదే కేసులో సోనియా, రాహుల్ వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పట్లో అది పెద్ద ఊరటగా భావించారు. అయితే, దిగువ కోర్టు న్యాయమూర్తి అవసరం అనుకుంటే మాత్రం వాళ్లిద్దరినీ కోర్టుకు పిలవచ్చని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పుడు దిగువ కోర్టు కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడంతో కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం రాహుల్, సోనియాలకు రాలేదు. అలాగే నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్యామ్ పిట్రోడాకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కేసులోని సోనియా, రాహుల్ సహా ఇతరులు ఇంతకుముందే బెయిల్ పై ఉండగా.. తాజాగా పిట్రోడాకు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది. అనంతరం కేసు విచారణను మార్చి 21 కి వాయిదా వేసింది.