పనాజీ : పదో తరగతి సోషల్ బుక్‌లో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఫోటో స్ధానంలో ఆరెస్సెస్ సహవ్యవస్ధాపకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ సావర్కర్ ఫోటో ముద్రించడంపై ఎన్‌ఎస్‌యూఐ అభ్యంతరం తెలపడం గోవాలో వివాదానికి తెరలేచింది. పాఠ్యపుస్తకంలో పండిట్ నెహ్రూ ఫోటోను తొలగించి సావర్కర్ ఫోటోను చేర్చడం బాధాకరమని ఎన్‌ఎస్‌యూఐ గోవా చీఫ్ అహ్రజ్ ముల్లా ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్- ప్రజాస్వామిక రాజకీయాలు అనే పేరుతో పదోతరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలోని 68వ పేజీలో 1935లో మహారాష్ట్ర సేవాగ్రమ్ ఆశ్రమ్‌లో మహాత్మ గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్ ఉన్నప్పటి ఫోటోలున్నాయని, అయితే అదే పుస్తకం తర్వాతి ఎడిషన్‌లో నెహ్రూ ఫోటోను తొలగించి, ఆ స్ధానంలో సావర్కర్ ఫోటోను ముద్రించారని ఆయన చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పాత్రను తొలగించి చరిత్రను మార్చే కుట్రలో భాగంగానే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రేపు మహాత్మా గాంధీ ఫోటోను సైతం బీజేపీ తొలగించి 60 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందని ప్రశ్నిస్తుందని అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా చరిత్రను మార్చలేదని, స్వాతంత్ర్య సముపార్జనలో కాంగ్రెస్ పాత్రను చెరిపివేయలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment