శాస్త్రి మృతికి బోస్ అంశం కారణమా?
కోల్కతా: మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బోస్ అదృశ్యానికి సంబంధించిన మరిన్ని ఫైళ్లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవలే బహిర్గతం చేయగా.. రష్యాలోని తాష్కెంట్లో మృతి చెందిన లాల్ బహదూర్ శాస్త్రి మృతిపై ప్రభుత్వం సిద్ధంచేసిన ఫైళ్లను బయటపెట్టాలని ఆయన కుమారులు బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం విదితమే.
నేతాజీ కుటుంబానికి చెందిన చంద్రకుమార్ బోస్ సోషల్ మీడియా ఫేస్బుక్లో కొన్ని మిస్టరీ అంశాలను పోస్ట్ చేశారు. ఈ తాజా పరిణామాలను బట్టి చూస్తే శాస్త్రి మరణానికి నేతాజీ అదృశ్యం కారణమా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 1966 జనవరిలో రష్యా పర్యటనకు వెళ్లే ఒక నెల ముందు(డిసెంబర్ 23న) శాస్త్రిని కోల్కోతాలో తన తండ్రి అమియనాథ్ బోస్ కలిసినట్లు పేర్కొన్నారు.
తన రష్యా పర్యటనలో నేతాజీ ఆ దేశంలో ఉన్నాడేమో తెలుసుకుంటానని శాస్త్రి ఆ భేటీలో అమియానాథ్కు చెప్పినట్లు వెల్లడించారు. అంతేగాక దేశం గర్వించదగ్గ వ్యక్తి అని, దేశ ప్రధానులందరిలోనూ లాల్ బహదూర్ శాస్త్రి చాలా గొప్పవాడంటూ కొనియాడారు. అయితే తన ఫేస్బుక్ ఖాతాలో శాస్త్రి మృతి, నేతాజీ అదృశ్యం అంశాలపై చంద్రకుమార్ బోస్ పోస్ట్ చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నట్లు కనిపిస్తోంది.