8 మందినీ చంపేశారు.. కంగ్రాట్స్!
8 మందినీ చంపేశారు.. కంగ్రాట్స్!
Published Fri, Nov 4 2016 12:52 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో తాజాగా రెండు ఆడియో క్లిప్స్ బయటపడ్డాయి. అండర్ ట్రయల్ ఖైదీలను వెంబడించిన బలగాలకు, పోలీసు కంట్రోల్ రూంకు మధ్య జరిగిన సంభాషణలుగా వీటిని చెబుతున్నారు. వైర్‌లెస్‌లో అయితే సరిగా వినపడదని, అందువల్ల సొంత మొబైల్ ఫోన్లు వాడాలని అధికారులు అక్కడకు వెళ్లిన సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది. వాళ్ల సంభాషణలు ఇలా ఉన్నాయి...
''వాళ్లను అన్నివైపుల నుంచి చుట్టుముట్టండి.. కంగ్రాట్యులేషన్స్, మొత్తం ఎనిమిది మందీ చనిపోయారట, డీఎస్పీ క్రైం చెప్పారు. వెరీగుడ్. వాళ్ల శవాలు మధ్యలో పడి ఉన్నాయి'' అని ఒకరు అన్నారు.
''వెనక్కి రావద్దు. అందరు చార్లీలకు చెప్పండి, వాళ్లను చుట్టుముట్టి పని పూర్తిచేయండి'' అని మరో గొంతు చెప్పింది.
ఈ ఆడియో క్లిప్పింగుల గురించి తనకు ఇంకా ఏమీ తెలియదని, తాను వినలేదని.. తమ దర్యాప్తులో మొత్తం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని సీఐడీ ఎస్పీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆయన ఈ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీని గురించి అధికారులు చెప్పే విషయాలకు, వీడియోల్లో ఉన్న విషయాలకు పొంతన లేకుండా పోతోంది.
అత్యంత పటిష్ఠమైన భద్రత ఉండే భోపాల్ సెంట్రల్ జైలుకు ఉన్న 32 అడుగుల ఎత్తయిన గోడను దుప్పట్ల సాయంతో ఉగ్రవాదులు దూకారని పోలీసులు చెబుతున్నారు. ఒక హెడ్ కానిస్టేబుల్ గొంతు కోసి మరీ వాళ్లు పారిపోయారు. అక్టోబర్ 31వ తేదీ తెల్లవారుజాము సమయంలో (దీపావళి రోజు అర్ధరాత్రి) ఈ ఘటన జరిగింది.
ప్రస్తుతం ఈ కేసు విషయంలో వస్తున్న ప్రశ్నలన్నింటినీ కూడా దర్యాప్తులో భాగంగా తాము జతచేస్తామని, ఉగ్రవాదులు తప్పించుకున్నప్పటి నుంచి ఎన్‌కౌంటర్‌లో మరణించేవరకు గడిచిన ఏడు గంటల్లో జరిగిన ఘటనలన్నింటినీ కూడా పరిశీలిస్తామని భోపాల్ ఐజీ యోగేష్ చౌదరి తెలిపారు. అయితే.. తమకు, ఉగ్రవాదులకు మధ్య భారీ స్థాయిలో ఎదురు కాల్పులు జరిగాయని పోలీసులు అంటున్నారు. వాళ్ల వద్ద నుంచి నాటు తుపాకులు, కొన్ని పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే.. తాజాగా బయటపడిన ఆడియో క్లిప్‌లు, ఇప్పటికే ఉన్న వీడియోలు నిజమైనవా కావా అనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు.
Advertisement
Advertisement