కొత్త నోట్లను ఎలా గుర్తించేది?
న్యూఢిల్లీ: నోట్ల రద్దు చర్యతో దేశ వ్యాప్తంగా సామాన్యుల కష్టాలు బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద కనిపిస్తున్నాయి. అయితే.. కనిపించని మరో కష్టం నోట్ల రద్దుతో ఏర్పడింది. అదే చూపులేని వారు నోట్లను గుర్తించడంలో పడుతున్న కష్టం.
ఇంతకు ముందున్న నోట్లను చాలా కాలంగా తమ చేతులతో తడుముతూ గుర్తించడం నేర్చుకున్న చూపులేని వారు ఇప్పుడు కొత్త నోట్లను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారి అవసరాల్లో భాగంగా నోట్లను ఇచ్చి పుచ్చుకునే సందర్భంగా ఏది ఏ నోటో గుర్తించడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. కొత్త రూ. 2వేల నోటు 20 రూపాయల నోటుకు, 500 నోటు 10 రూపాయల నోటుకు దగ్గరి పరిమాణంలో ఉన్నాయని అందువల్ల లావాదేవీల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు.
గతంలో నోట్లను తడిమినప్పుడు వాటి చివర్లలోని టాక్టైల్ మార్కింగ్స్ ద్వారా గుర్తించేవాళ్లం అని.. ఇప్పుడు కొత్తగా వచ్చిన నోట్లను గుర్తించడం వీలు కావట్లేదని వారు చెబుతున్నారు. నోట్లను గుర్తించేలా కేఎన్‌ఎఫ్‌బీ రీడర్, బ్లైండ్-డ్రయిడ్ లాంటి కొన్ని యాప్‌లు ఉన్నప్పటికీ.. చూపులేనివారిలో చాలా మందికి ఆ యాప్‌ల గురించే తెలియదని బెంగళూరుకు చెందిన జానకి అనే మహిళ వెల్లడించింది.