నిషేధిత దుఖ్‌తరన్-ఈ-మిలత్ చీఫ్ ఆసియా ఆండ్రాబీ
సాక్షి, న్యూఢిల్లీ : లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న కశ్మీరి వేర్పాటు వాది ఆసియా ఆండ్రాబీని విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆసియాకు పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న విషయాన్ని నిరూపించేందుకు తగిన ఆధారాలు సమీకరించినట్లు పేర్కొన్నారు. లండన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఓ ఆలయాన్ని ప్రారంభించిన సమయంలో.. లష్కర్- ఎ- తొయిబాతో సహా పలు ఉగ్రవాద సంస్థలకు ఆసియా ఆడియో మెసేజ్‌ల ద్వారా సమాచారాన్ని చేరవేసినట్లు తెలిపారు. మోదీ పర్యటనలో ఉన్న సమయంలో భారత్‌పై దాడి చేసేందుకు ప్రపంచం నలుమూలలా ఉన్న ఉగ్రవాదులు ఏవిధంగా ప్రణాళికలు రచించారో తమ విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
ఆసియా ఆండ్రాబీ నేపథ్యం..
కశ్మీర్‌లో ప్రముఖ వేర్పాటు వాదిగా గుర్తింపు పొందిన 56 ఏళ్ల ఆసియా ఆండ్రాబీ 2016లో ఉగ్రవాది బుర్హాన్ వనీ మరణానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి వెలుగులోకి వచ్చారు. బుర్హాన్ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాల్ని నిర్వహించిన ఆసియా విద్యార్థులను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమయ్యారు. దుఖ్‌తరన్-ఈ-మిలాత్ అనే సంస్థను నెలకొల్పి.. భారత్‌పై ద్వేష భావంతో రగిలిపోయే విద్యార్థినులను తన సంస్థలోకి ఆహ్వానించేవారు. కాగా ఈ సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించింది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్ జెండాలు ఎగరవేసినందుకు ఆసియా పలుమార్లు అరెస్టయ్యారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు మెల్‌బోర్న్‌లో ఎంటెక్ చేస్తుండగా, మరొకరు మలేషియా ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరికి కూడా ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
కాగా లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసియాను శ్రీనగర్ జైలు నుంచి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. పలు సామాజిక మాధ్యమాల ద్వారా ద్వేషపూరిత భావాల్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు, సౌభ్రాతృత్వానికి భంగం కలిగిస్తున్న కారణంగా ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పాక్‌లోని అనేక ఉగ్ర సంస్థలతో సోషల్ మీడియాలో కాంటాక్ట్‌లో ఉన్న ఆసియా.. అఖండ పాకిస్తాన్ స్థాపన కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment