
photo credit:HINDUSTAN TIMES
వాషింగ్టన్:ఇరాన్‌పై అమెరికా మళ్లీ కన్నెర్ర చేసింది. ఆ దేశంపై సంచలన ఆరోపణలు చేసింది. ఎర్రసముద్రంలో వాణజ్య నౌకల మీద హౌతీ మిలిటెంట్ల దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందన్న విషయం స్పష్టమవుతోందని ఆరోపించింది. నౌకల మీద దాడి చేసేందుకుగాను హౌతీ తిరుగుబాటుదారులకు అవసరమైన డ్రోన్లు, మిసైళ్లు, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇరాన్ అందిస్తోందని అమెరికా తెలిపింది.
‘ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల మీద జరుగుతున్న దాడి వెనుక ఇరాన్ ప్రముఖ పాత్ర వహిస్తోందని మాకు తెలుసు. అక్కడ అనిశ్చితి రేపేందుకు ఇరాన్ ఎప్పటినుంచో హౌతీ రెబెల్స్‌కు సహకరిస్తోంది. స్పష్టమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఈ ఆరోపణలు చేస్తున్నాం’ అని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి అడ్రియెన్ వాట్సన్ మీడియాకు తెలిపారు.
పాలస్తీనాకు మద్దతుగా యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలోని కీలక షిప్పింగ్ లైన్స్‌లో ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. నౌకలపై హౌతీ దాడులను అడ్డుకునేందుకుగాను 10 దేశాలతో కలిసి అమెరికా ఇటీవలే ఒక కూటమిని ఏర్పాటు చేసింది.