శబరిమల/తిరువనంతపురం: శబరిమల అయ్యప్పస్వామి సన్నిధిలో ఏటా నిర్వహించే పవిత్రమైన ‘నిరపుధారి’పూజను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. ముందుగా నిర్ణయించినట్లు బుధవారం యథావిధిగా పూజ ఉంటుంది. ఆలయ ప్రధాన పూజారి ఇప్పటికే ఆలయానికి చేరుకున్నారని, పూజకు అవసరమైన వరిపంటను మంగళవారం సాయంత్రానికి తీసుకొస్తామని టీడీబీ అధ్యక్షుడు పద్మకుమార్ తెలిపారు.
వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 2 బృందాలు వేర్వేరు మార్గాల ద్వారా పంటను తీసుకొస్తున్నాయి. మంగళవారం సాయంత్రం అయ్యప్ప దేవాలయాన్ని తెరుస్తారు. పంపానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో భక్తులెవరూ శబరిమలకు రావోద్దని అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న ఓనమ్ వేడుకలను రద్దు చేశామని, ఈ మొత్తాన్ని వరద సహాయక కార్యక్రమాలకు వాడతామన్నారు.
రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.వెయ్యి కోట్లు, శబరిమల రోడ్లకు రూ.200 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం నాటికి 40 మంది ప్రాణాలు కోల్పోగా.. 20వేల ఇళ్లు, 10వేల కి.మీ రోడ్లు ధ్వంసం అయ్యాయి. వరదలు కారణంగా వాయనడ్, ఇడుక్కి జిల్లాలు తుడిచిపెట్టుకుపోయాయి. మట్టుపెట్టి డ్యాం గేట్లు ఎత్తటంతో ఇడుక్కిలోని మన్నార్‌కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment