సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగటం చాలా బాధాకరమన్నారు. ఆడపిల్లలు బయటకు వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి దేశంలో లేకుండా పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పాశవిక దాడులు జరుగుతుంటే పోలీసులు, అధికార వ్యవస్థ ఏ స్థితిలో ఉందో అర్థమవుతోందని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన అనంతరం శుక్రవారం ఆమె స్థానిక మీడియాతో ఆమె మాట్లాడారు. తన బిడ్డలానే ప్రియాంక కూడా కామాంధుల దాహనికి బలైపోయిందని గుర్తుచేశారు. ప్రియాంకను హతమార్చిన వారిని వెంటనే అరెస్ట్ చేసి ఉరి శిక్షను వేయాలని ఆమె డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు కనీస భద్రత లేకుండాపోయిందని, దీనికి కేంద్రప్రభుత్వం తగు చర్యలను తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి ఘటనలు జరకుండా ఉండాలంటే దోషులకు కఠిన శిక్షలు వేయాలని అన్నారు. నిర్భయ ఘటన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్న దోషులకు ఇంకా ఉరిశిక్ష అమలు చేయకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను ఉరి తీసేంతవరకు తమ పోరాటం ఆగదని ఆశాదేవి తెలిపారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలోని నిర్భయ ఘటనను తలపిస్తున్న ప్రియాంకరెడ్డి ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఈ కేసును సుమోటాగా తీసుకుని.. విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించేవరకు పోరాడుతామని స్పష్టం చేసింది. దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారని.. ఇలాంటి దారుణ ఘటనలు జరిగితే మహిళలు స్వేచ్ఛగా ఎలా తిరగలుగుతారని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఓ లేఖ రాశారు. కాగా వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యపై టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ప్రియాంకరెడ్డి హత్య తమను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇలా చేసుంటే ఘోరం జరిగేది కాదు
Comments
Please login to add a commentAdd a comment