‘కరోనా’ ప్యాకేజీ | Nirmala Sitharaman announces Rs 1.7 lakh crore relief package for poor | Sakshi
Sakshi News home page

‘కరోనా’ ప్యాకేజీ

Published Fri, Mar 27 2020 4:41 AM | Last Updated on Fri, Mar 27 2020 7:59 AM

Nirmala Sitharaman announces Rs 1.7 lakh crore relief package for poor - Sakshi

ఢిల్లీలోని ప్రభుత్వ షెల్టర్‌లో నిరుపేదలకు ఆహారం పంపిణీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు అమలు చేస్తున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బంది పడకుండా రూ.1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రధాని మోదీ ప్రకటించిన 36 గంటల్లోనే ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు వచ్చే మూడు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు, వంటగ్యాస్‌ పంపిణీ చేయడంతోపాటు మహిళలు, సీనియర్‌ సిటిజన్లకు ఆర్థికంగా చేయూత అందివ్వడం వంటి చర్యలను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం వెల్లడించారు. లాక్‌డౌన్‌తో పేదలు, కూలిపని వారు ఇబ్బంది పడకుండా ప్రకటించిన ఈ చర్యలు వెంటనే అమల్లోకి వస్తాయని మీడియా సమావేశంలో మంత్రి వివరించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో ఎవరూ బాధపడరాదనేదే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం లక్షిత వర్గాలకు అందేలా శ్రద్ధ వహిస్తామన్నారు. అవసరమైతే ఇలాంటి మరిన్ని చర్యలను మున్ముందు ప్రకటిస్తామని కూడా ఆమె చెప్పారు. దేశంలోని లాక్‌డౌన్‌ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ ఆర్థిక ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు.

మంత్రి ప్రకటించిన సహాయ చర్యలివే...
► దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల నిరుపేద రేషన్‌ కార్డు దారులకు 5 కిలోల చొప్పున మూడు నెలల పాటు ఉచితంగా గోధుమలు లేదా బియ్యం, ఒక కిలో పప్పుధాన్యాలు. వీటిని లబ్ధిదారులు రెండు విడతల్లో తీసుకోవచ్చు.

► దేశవ్యాప్తంగా నిరుపేద మహిళల 20.4 కోట్ల జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున మూడు నెలలపాటు అందుతాయి.
     నిరుపేద మహిళల కోసం 2016 నుంచి అమలు చేస్తున్న ఉచిత వంటగ్యాస్‌ పథకంలో భాగంగా వచ్చే మూడు నెలలపాటు ఉచితంగా ఎల్పీజీ. అదేవిధంగా, పేద సీనియర్‌ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు రూ.1,000 పంపిణీ.

► 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా రైతులకు ఏడాదికిచ్చే రూ.6 వేలను విడతలు వారీగా ముందుగానే అందజేయనుంది. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.2 వేలను ఏప్రిల్‌ మొదటి వారంలోనే రైతుల బ్యాంకు అకౌంట్లలో వేయనుంది. దీనివల్ల 8.69 కోట్ల రైతు కుటుంబాలకు ఊరట లభించనుంది.

► నెలకు రూ.15 వేల కంటే తక్కువ వేతనం పొందే ఉద్యోగులు 90 శాతం (100 మంది లోపు) ఉండే చిన్న సంస్థలకు వచ్చే మూడు నెలలపాటు వారి పీఎఫ్‌ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. దీనివల్ల 4.8 కోట్ల పీఎఫ్‌ అకౌంట్లు నిరాటంకంగా కొనసాగుతాయి.

► దేశవ్యాప్తంగా ఉన్న 5 కోట్ల మంది ఉపాధి హామీ సిబ్బంది రోజువారీ కూలీ రూ.182 నుంచి రూ.202కు పెంపు

► దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయ సంఘాల్లోని 63 లక్షల మంది మహిళల రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు. దీనివల్ల 7 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

► చిన్న సంస్థల ఉద్యోగులు తమ ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌ లేదా మూడు నెలల వేతనం (ఏది తక్కువుంటే అది)లో 75 శాతం మొత్తాన్ని  ఉపసంహరించుకునే వీలు కల్పించింది.  


ఆరోగ్య సిబ్బందికి అరకోటి బీమా:
ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాటంలో ముందుండే వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య, పారామెడికల్‌ సిబ్బందికి ప్రభుత్వం రూ.50 లక్షల ఆరోగ్య బీమా. మార్చి 25వ తేదీ నుంచి మూడు నెలలపాటు ఇది అమల్లో ఉండనుంది.

ప్రభుత్వంపై పడే భారం:  
ప్రధాన్‌మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద 8.7 కోట్ల మంది రైతులకు రూ.2 వేల చొప్పున అందజేయడానికి ప్రభుత్వం రూ.16వేల కోట్లు.. ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీకి రూ.45 వేల కోట్లు.. జన్‌ధన్‌ అకౌంట్లలో డబ్బు జమ చేయడానికి రూ.31 వేల కోట్లు. ఉచిత వంటగ్యాస్‌ కోసం మరో రూ.13 వేల కోట్లు వెచ్చించనుంది.  

లాక్‌డౌన్‌ను సమర్థించిన సోనియా గాంధీ
కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ సమర్థించారు. వ్యాధి బాధితులకు చికిత్స అందించే వైద్యులకు రక్షణ కల్పించాలని, రుణ వసూళ్ల వాయిదా తదితర చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని ప్రకటించిన దేశవ్యాప్త 21 రోజుల లాక్‌డౌన్‌ను స్వాగతిస్తున్నాను. ఈ మహమ్మారిపై పోరాటంలో దేశంయావత్తూ ఒక్కటై నిలవాలి. జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా.. ఈ వ్యాధిపై కేంద్రం తీసుకునే ప్రతి చర్యను సమర్థిస్తూ మద్దతు తెలుపుతున్నాను. ఈ ఆపత్కాలంలో విభేదాలను మరిచి అందరం ఒక్కటిగా నిలవడం మన బాధ్యత’ అని పేర్కొన్నారు.

ప్రభుత్వానికి సోనియా చేసిన సూచనలు కొన్ని.. జన్‌ధన్, ప్రధాన్‌మంత్రి కిసాన్‌ యోజన అకౌంట్లు కలిగిన వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, ఉపాధి కూలీలకు రూ.7,500 చొప్పున ఇవ్వాలి.ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కార్డు దారులందరికీ 10 కిలోల బియ్యం లేదా గోధుమలు అందజేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో అన్ని రకాలైన కోతలను ఆరు నెలలపాటు వాయిదావేయాలి. వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందికి ఎన్‌–95 వంటి మాస్కులు, హజ్మత్‌ సూట్ల వంటి రక్షణ పరికరాలను అందజేయాలి. వీరికి ఆరు నెలలపాటు రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలి. కరోనా వ్యాప్తికి అవకాశాలున్న చోట్ల ఐసీయూలు, వెంటిలేటర్లతో తాత్కాలిక వైద్య కేంద్రాలను పెద్ద సంఖ్యలో  ఏర్పాటు చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement