ఫైజాబాద్/లక్నో : వారణాసి- బంగ్లాదేశ్‌ల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు సరయూ నది గుండా జలమార్గాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రవాణా, జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించిన ఆయన రూ. 7,195 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా నుంచి ఎయిర్‌బోట్లను తెప్పిస్తున్నాను. మళ్లీ ఇక్కడికి నేను వచ్చేనాటికి తప్పకుండా ఎయిర్‌బోట్‌లోనే ప్రయాణిస్తాను. వారణాసి- అలహాబాద్ మధ్య ప్రయాణం సులభతరం చేస్తాం. ఎగిరే డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నా’ అని పేర్కొన్నారు. యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్‌తో సంభాషిస్తూ.. మెట్రో కంటే కూడా డబుల్ డెక్కర్ ఎయిర్‌బస్సులే చవకగా వస్తాయని గడ్కరీ వ్యాఖ్యానించారు.
వచ్చే మార్చినాటికి గంగానది నీరు తాగొచ్చు
గంగానది ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే 30 శాతం నదిని శుభ్రం చేశామని.. వచ్చే మార్చి నాటికి పూర్తి స్థాయిలో నదీ ప్రక్షాళన జరుగుతుందన్నారు. ఇక అప్పుడు గంగానది నీరు సేవించవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment