జేడీయూ శాసనసభా పక్షనేతగా నితీష్ ఎన్నిక
పాట్నా: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి జేడీయూ షాక్ ఇచ్చింది. శనివారం ఆయన్ను జేడీయూ శాసనసభా పక్ష నేతగా తొలగించి.. ఆ బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అప్పగించింది. అంతకుముందు బీహార్ లో హైడ్రామా నడిచింది. ఏకంగా అసెంబ్లీని రద్దు చేస్తానంటూ హెచ్చరించిన మాంఝీ నానా హడావుడి సృష్టించారు. దీనిలో భాగంగా అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అయితే కొంతమంది నితీష్ మద్దతుదారులు దీన్ని వ్యతిరేకించడంతో ఆ సమావేశం రసాభాసగా మారింది. అటు తరువాత శరవేగంగా మారిన రాజకీయ పరిణామాలతో జేడీయూ అధినాయకత్వం అనుకున్నట్లుగానే మాంఝీ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఊహించినట్లుగానే రామ్ మాంఝీని పార్టీ నుంచి జేడీయూ తొలగించింది.