నితీశ్ కుమార్‌కే పట్టం ! | Nitish Kumar to be crowned! | Sakshi
Sakshi News home page

నితీశ్ కుమార్‌కే పట్టం !

Published Sun, Feb 8 2015 3:41 AM | Last Updated on Mon, Sep 17 2018 4:55 PM

Nitish Kumar to be crowned!

  • జేడీయూ శాసన సభా పక్ష నేతగా ఎన్నిక
  •  మద్దతు పలికిన 97 మంది ఎమ్మెల్యేలు, 37 మంది ఎమ్మెల్సీలు
  •  ఎల్పీ సమావేశం నిర్వహించి పంతం నెగ్గించుకున్న పార్టీ
  •  అసెంబ్లీ రద్దుకు మంఝి విఫలయత్నం.. కేబినెట్ భేటీలో రద్దును వ్యతిరేకించిన 20 మంది మంత్రులు.. అనంతరం రాజీనామా చేస్తూ గవర్నర్‌కు లేఖ
  •  వెనక్కి తగ్గని మంఝి.. మరో 15 మంది మంత్రుల బర్తరఫ్‌కు సిఫారసు
  •  ప్రభుత్వం కొనసాగేందుకు అవసరమైతే బీజేపీ మద్దతు: మంఝీ వర్గం
  •  పట్నా: బిహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝిని గద్దె దింపాలన్న పంతాన్ని జేడీయూ నెగ్గించుకుంది. ఎన్నికల ముంగిట మాజీ సీఎం నితీశ్ కుమార్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం హైడ్రామా మధ్య జేడీయూ శాసన  సభాపక్ష(ఎల్పీ) నేతగా నితీశ్ ఎన్నికయ్యారు. జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఎల్పీ సమావేశానికి పార్టీకి చెందిన మొత్తం 111 మంది ఎమ్మెల్యేలలో 97 మంది హాజరయ్యారు. శాసన మండలికి చెందిన 41 మంది సభ్యుల్లో 37 మంది హాజరయ్యారు. సీఎం మంఝి, ఆయనకు మద్దతుగా నిలిచిన ఎనిమిది మంది మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీకి గైర్హాజరయ్యారు.
    సమావేశంలో ఎల్పీ కొత్త నేతగా ఎమ్మెల్యే అరుణ్ మంఝి.. నితీశ్ పేరు ను ప్రతిపాదించారు. సభ్యులంతా అందుకు ఆమోదం తెలిపారు. అంతకుముందు పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన ఉద్వాసనకు రంగం సిద్ధమైందని తెలుసుకున్న మంఝి.. చివరి ప్రయత్నంగా అసెంబ్లీ రద్దు అస్త్రాన్ని ప్రయోగించాలని చూశారు. ఎల్పీ భేటీకి ముందు హడావుడిగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి 29 మంది మంత్రులు హాజరయ్యారు. మంఝి మద్దతుదారు అయిన నరేంద్ర సింగ్ అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే దీన్ని 20 మంది మంత్రులు (నితీశ్ మద్దతుదారులు) తిర స్కరించారు. 8 మంది మాత్రమే మంఝికి మద్దతుగా నిలిచారు.

    ఇద్దరు మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్ లలాన్, పీకే సాహిలను బర్తరఫ్ చేయాలంటూ శుక్రవారం సీఎం మంఝి చేసిన సిఫారసుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో వారిద్దరు కేబినెట్ భేటీ కి హాజరుకాలేదు. అసెంబ్లీ రద్దు ప్రతిపాదనను వ్యతిరేకించిన 20 మంత్రులు తమ సంతకాలతో ఓ లేఖను రాష్ట్రపతి ప్రణబ్‌తోపాటు గవర్నర్‌కు పంపారు. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని  వ్యతిరేకిస్తున్నట్లు అందులో తెలిపారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తూ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీకి మరో లేఖ పంపారు. సోమవారం నితీశ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌కు శరద్ విజ్ఞప్తి చేయనున్నారు.
     
    సయోధ్య యత్నం విఫలం.. కేబినెట్ భేటీకి ముందు మంఝి, నితీశ్ మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరిగాయి. ఘర్షణ వాతావరణం లేకుండా గద్దె దిగాలంటూ శరద్ యాదవ్... మంఝిని ఒప్పించేందుకు యత్నించారు. కానీ అవేవీ ఫలితం ఇవ్వలేదు. పార్టీ సీనియర్ నేత, మంత్రి నరేంద్ర సింగ్.. నితీశ్, మంఝిల మధ్య భేటీకి చొరవ చూపించారు. ఉదయం 11 గంటలకు సింగ్... నితీశ్ ఇంటికెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం సీఎం ఇంటికి వెళ్లారు. తర్వాత సీఎంను, ఆయనకు మద్దతుగా నిలిచిన మరో ఇద్దరు మంత్రులను వెంటబెట్టుకొని నితీశ్ ఇంటికెళ్లారు. అక్కడ శరద్ సమక్షంలో 2 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు సాగించారు. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని యాదవ్ కోరగా.. మంఝి అందుకు నిరాకరించారు. దాంతో జేడీయూ... ఎల్పీ భేటీ ఏర్పాట్లలో మునిగిపోయింది.
     
    పూర్తి మెజారిటీ ఉంది.. నితీశ్

    శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత నితీశ్ ఉల్లాసంగా కనిపించారు. తనకు మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారన్నారు. ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, అవసరమైతే ఎమ్మెల్యేలతో పరేడ్‌కు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శరద్.. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకుంటారన్నారు. అంతకుముందు ఎల్పీ భేటీలో మాట్లాడుతూ... జేడీయూపై బీజేపీ చేస్తున్న నీచ రాజకీయాల నేపథ్యంలో ఈ సవాలును స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇకపై అందరికంటే ముందుండి బీజేపీపై పోరాడతానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ నితీశ్ కిందటేడాది మే 19న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, సీఎంగా మంఝి పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
     
    మరో 15 మంది మంత్రుల బర్తరఫ్‌కు సిఫారసు

    పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు నితీశ్ వైపు మొగ్గినా.. మంఝి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మరో 15 మంది మంత్రుల(నితీశ్ వర్గం)ను బర్తరఫ్ చేయాల్సిందిగా గవర్నర్‌కు సిఫారసు చేశారు. ఆదివారం నీతి అయోగ్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ బయల్దేరే ముందు ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు చేశారు.  మంఝి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేస్తారని ఆయన మద్దతుదారు నరేంద్ర సింగ్ తెలిపారు. మంఝి ప్రభుత్వం కొనసాగేందుకు అవసరమైతే బీజేపీ సాయం కూడా తీసుకుంటామని ఆయన చెప్పడం గమనార్హం. ఢిల్లీ వెళ్లిన మంఝి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలిసింది.
     
    పార్టీకి ద్రోహం చేశారు: శరద్ యాదవ్

    మంఝీ... అన్నం పెట్టిన చేయికే అన్యాయం చేశారని శరద్  మండిపడ్డారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలన్నింటి నీ నీరుగార్చారని దుయ్య బట్టారు.
     
    కల చెదిరి మళ్లీ సీఎంగా!

    2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే బిహార్‌లో జేడీయూ, ఎన్డీఏ కూటమి విచ్ఛిన్నమైంది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంపై నితీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ఎన్నికల ముంగిట థర్డ్‌ఫ్రంట్ ఏర్పడితే కాంగ్రెసేతర లౌకిక కూటమికి నాయకుడిగా ఎదగాలని తాపత్రయపడ్డారు. థర్డ్‌ఫ్రంట్ తరఫున ప్రధాని రేసులో నిలవాలని ఉవ్విళ్లూరారు. ఇందులో భాగంగానే తరచూ మోదీపై విమర్శలకు దిగడంతో తనపై ‘లౌకికవాది’గా ముద్ర వేయించుకునే యత్నం చేశారు.

    ఇది చివరకు ఎన్డీఏ, జేడీయూ పొత్తు విచ్ఛిన్నానికి దారి తీసింది. ఎన్డీయే కన్వీనర్ పదవి నుంచి శరద్ యాదవ్ తప్పుకున్నారు. తర్వాత థర్డ్‌ఫ్రంట్ కలగానే మిగిలిపోవడం, నితిశ్ ‘ప్రధాని’ ఆశ కూడా నెరవేరకపోవడం, 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయ దుంధుబి మోగించడం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లోని 40 స్థానాల్లో జేడీయూ కేవలం 2 లోక్‌సభ సీట్లకే పరిమితమైంది. మిత్రపక్షాలైన ఆర్జేడీ 4, కాంగ్రెస్ 2 స్థానాలు దక్కించుకోగా.. బీజేపీ 22 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది.

    దీంతో ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ నితీశ్ 2014 మే 19న సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. తనకు నమ్మిన బంటైన మంఝిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు.  అయితే మంఝి మోదీని పొగడం, తరచూ పార్టీకి నష్టం కలిగించే ప్రకటనలు చేయడం ఆయన పదవికి ఎసరు తెచ్చింది. ఈ ఏడాది చివర్లో బిహార్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మంఝిని ఇంకా కొనసాగిస్తే పార్టీకి నష్టం తప్పదన్న వాదనతో నితీశ్ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
     
    బిహార్ అసెంబ్లీలో జేడీయూ బలం 111 కాగా శనివారం పార్టీ ఎల్పీ భేటీకి 97 మంది హాజరయ్యారు. 14 మంది దూరంగా ఉన్నారు. వీరిలో మంఝితో పాటు మరో 8 మంది ఆయనకు మద్దతు తెలిపిన మంత్రులు. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు. బీజేపీ ముందుకు వచ్చి మంఝికి మద్దతునిచ్చే పక్షంలో (87 బీజేపీ, మంఝి వర్గం 14) 101 మంది బలం ఉంటుంది. సాధారణ మెజారిటీకి 117 (10 స్థానాలు ఖాళీగా ఉన్నాయి) మంది మద్దతు అవసరం. అంటే మంఝికి మరో 16 మంది ఎమ్మెల్యేలు మద్దతివ్వాలి.

    నితీశ్‌కు 97 మంది జేడీయూ ఎమ్మెల్యేలతో పాటు ఆర్జేడీ (24), కాంగ్రెస్ (5), సీపీఐ (1) మద్దతుంది. అంటే మొత్తం నితీశ్‌కు 127 మంది ఎమ్మెల్యేల మద్దతున్నట్లు లెక్క. మంఝి మరో 16 మంది పైచిలుకు జేడీయూ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోగలిగితే... బీజేపీ మద్దతుతో సీఎంగా కొనసాగవచ్చు. అలాంటి పరిణామాలే చోటుచేసుకుంటే మంఝి రాజీనామా చేయలేదు కాబట్టి... అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ అడగొచ్చు. అయితే 2015 అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకొని ఇప్పటికే విమర్శల పాలైన మంఝికి బీజేపీ మద్దతు ఇస్తుందా అనేది అసలు ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement