సీఎంగారే గురువు అంటున్న డిప్యూటీ
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనకు గురువు అని, ఆయన పరిపాలన విధానాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో తేజస్వి మాట్లాడుతూ.. తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు సభ ప్రాథమిక నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు.
ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే కావడం కంటే తమ బాధ్యతలను తెలుసుకోవడం చాలా ముఖ్యమని తేజస్వి చెప్పారు. తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను తరచూ నిర్వహించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరికి విన్నవించారు. ఇటీవల బిహార్ ఎమ్మెల్యేలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వల్ల సమాజంలో ఎంపీలు, ఎమ్మెల్యేల పట్ల గౌరవం తగ్గిందని చెప్పారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూడాలని తేజస్వి కోరారు.