ఇక నితీశ్ తదుపరి లక్ష్యం ప్రధాని పీఠమే!
న్యూఢిల్లీ/పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ ఐదోసారి ప్రమాణం చేయడంతో.. ఇక ఆయన తదుపరి లక్ష్యం జాతీయ రాజకీయాలేనన్న ఊహాగానాలు సాగుతున్నాయి. జాతీయస్థాయిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎదుర్కొనేందుకు ఎన్డీయేతర పక్షాలు నితీశ్ నేతృత్వంలో ముందుకుసాగే అవకాశముందని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరుఖ్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు నితీశ్ ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించాలని ఆయన సూచించారు.
'భారత్‌కు ఇది కొత్త ప్రారంభం. ఢిల్లీ దిశగా అడుగులు వేస్తూ.. ప్రధాని పీఠం ఎక్కేందుకు నితీశ్ ఇప్పటినుంచి సిద్ధమవ్వాలి. ఈ విషయంలో ఆయనకు మేము మా పూర్తి మద్దతు అందిస్తాం' అని ఆయన మీడియాతో చెప్పారు. సీఎంగా నితీశ్ ప్రమాణం స్వీకారంలో పాల్గొన్న సందర్భంగా ఫరుఖ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ జరుగుతున్నది. బిహార్ ఎన్నికల్లో మోదీని చిత్తుగా ఓడించడంలో నితీశ్ విజయం సాధించినప్పటికీ, ఇప్పటికిప్పుడు ఆయన జాతీయ నాయకుడిగా ఎదుగడం అంత సులువుగా అనిపించడం లేదు. 2019లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. బిహార్ సీఎంగా ఆయన పదవీకాలంలో ఎన్నికల తర్వాత కొనసాగే అవకాశముంది. ఈలోగా దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను తన నేతృత్వంలో ఏమేరకు ఏకతాటిపైకి తెగలరన్నదని ఆయన ముందున్న ప్రధాన సవాలు. అయితే లౌకికవాద నేతగా ఆయనకున్న పేరు గతంలో కన్నా గణనీయమైన మద్దతును ప్రాంతీయ పార్టీల నుంచి అందించే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.