సిక్స్ ప్యాక్.. ఫిట్నెస్కు చిహ్నం కాదు!
కండలు పెంచినంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్లు కాదంటున్నారు వైద్య నిపుణులు. సిక్స్ ప్యాక్ బాడీ... చూసేందుకు ఫిట్ గా కనిపించినా... శరీర దారుఢ్యంతోపాటు, ఆరోగ్యంకూడ అవసరమని చెప్తున్నారు. ఫిట్నెస్ కోసం తరచుగా జిమ్ లకు వెళ్ళేవారు ట్రెండ్ ను ఫాలో అయ్యేందుకు బాడీ పెంచినా, తగిన ఆహార పద్ధతులను కూడ పాటించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో.. పోషక విలువలున్న ఆహారం కూడ అంతే అవసరమని చెప్తున్నారు.
బాలీవుడ్, టాలీవుడ్ తారలను, ప్రముఖ బాడీ బిల్డర్లను చూసి.. నేటి యువత సిక్స్ ప్యాక్ ట్రెండ్.. ఫాలో అయిపోతున్నారు. బానపొట్ట, వదులు శరీరం తగ్గించుకొని బాడీ ఫిట్నెస్ కోసం అత్యాధునిక జిమ్ లను ఆశ్రయిస్తున్నారు. కానీ చాలాశాతం వ్యాయామశాలల్లో శిక్షణ ఇచ్చేవారు తమ కస్టమర్లను డబ్బుకోసం తప్పుదారి పట్టిస్తుంటారు. తమ ఆదాయ వనరులను పెంచుకునేందుకు శరీరంలో కొవ్వును తగ్గించేందుకు ఆరోగ్యకరమైన ఆహారానికి బదులుగా మందులను సూచిస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఇటీవల సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించిన ఇద్దరు యువకులు కార్డియాక్ సమస్యతో ఏకంగా ప్రాణాలను సైతం పోగొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అందుకే ఫిట్నెస్ ప్రియులు కొవ్వును తగ్గించుకునేందుకు ప్రొటీన్ షేక్స్, స్టెరాయిడ్స్ వంటి వాటి జోలికి వెళ్ళవద్దని, ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామం ఫిట్నెస్ పెంచుకునేందుకు మూలాలని నిపుణులు సూచిస్తున్నారు. సిక్స్ ప్యాక్ ఆరోగ్యానికి చిహ్నం కాదని, ప్రకృతికి విరుద్ధంగా ప్రయత్నాలు చేయడం ఎంత మాత్రం సరికాదని ఫిట్నెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వారికిచ్చిన నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయడాని సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించే సినిమా యాక్టర్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఫాలో కావొద్దని హెచ్చరిస్తున్నారు.
ఫిట్నెస్ ప్రియులు ముఖ్యంగా వారికి సిక్స్ ప్యాక్ అవసరం ఎంతవరకు ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించి, రెండుసార్లు ప్లేట్ లెట్ కౌంట్ తగ్గడంతో ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితికి చేరుకున్నామని, సిక్స్ ప్యాక్ బాడీ కోసం 48 గంటలపాటు నీటికి, ఉప్పుకు దూరంగా ఉండటమేకాక, అదే సమయంలో వర్కవుట్ కూడ చేయాల్సి వస్తుందని అనుభవజ్ఞులు చెప్తున్నారు. అయితే ఇది భవిష్యత్తులో జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతోపాటు, వ్యాయామం చేయాలని సిక్స్ ప్యాక్ అభిమానులకు సలహా ఇస్తున్నారు.
ఒకవేళ తప్పనిసరిగా సిక్స్ ప్యాక్ చేయాలనుకుంటే ప్రకృతి సిద్ధమైన ఆహారమే తీసుకోవాలని, ఫలితానికి కొంత సమయం పట్టినా... ఆరోగ్యానికి నష్టం చేకూరదని చెప్తున్నారు. ఫిట్ గా కనిపించాలనుకుంటారే తప్ప... ఫిట్ గా ఉండాలనుకోరని మిస్టర్ ఇండియా రన్నర్ అప్ రాహుల్ రాజశేఖరన్ అంటున్నారు. రెండిటి మధ్య వ్యత్యాసాన్ని గమనించడం ఎంతో అవసరమని చెప్తున్నారు. శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా పనిచేసేందుకు స్త్రీ పురుషులిద్దరికీ కనీసం 15 నుంచి 20 శాతం కొవ్వు అవసరమౌతుందని, అయితే తమకు వృత్తి పరంగా అది సాధ్యం కాకపోవడంతో 5శాతం మాత్రమే కొవ్వు శరీరంలో ఉంటుందని, ఈ పరిస్థితి భవిష్యత్తులోతమకు తీవ్ర నష్టాన్ని కలుగజేయడంతోపాటు సమాజానికి తప్పుడు సందేశాన్ని అందించడం బాధగా అనిపిస్తుందని చెప్తున్నారు.