digvijay singh
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో టిడిపి వెనక్కి తగ్గినా, కాంగ్రెస్ వెనక్కి తగ్గదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆయన ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ 2004లో పార్టీ మేనిఫెస్టోలో కూడా తెలంగాణ అంశం ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు.
రాయలసీమ-ఆంధ్ర ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. సీమాంధ్రుల మనోభావాలను గౌరవిస్తామన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆంటోనీ కమిటీకి అన్ని విషయాలు విన్నవించుకోవచ్చని తెలిపారు. ఆంటోని కమిటీ కాంగ్రెస్ పార్టీ కమిటీ కాదని చెప్పారు. ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చన్నారు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చని తెలిపారు.
సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు సమ్మె విరమించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడిన తరువాతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ తాను చూశానని, విభజన తరువాత తలెత్తే
అంశాలనే ఆయన ప్రస్తావించినట్లు తెలిపారు. సీఎంపై ఎలాంటి చర్యలు ఉండవన్నారు. తాను కూడా సిఎంతో మాట్లాడినట్లు చెప్పారు. సిఎం చెప్పిన వివరణతో సంతృప్తి చెందినట్లు తెలపిఆరు.