తేదీ అదే.. 'ఫలితం' మాత్రం వేరు!
న్యూఢిల్లీ: కొన్ని సందర్భాల్లో సంఖ్యలు ఎంతటి ప్రభావం చూపిస్తాయో అనే దానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ఎపిసోడ్ ను ఒకసారి తిరగేస్తే సరిపోతుందేమో. 2013 డిసెంబర్ 28వ తేదీన కేజ్రీవాల్ సీఎంగా హస్తిన గద్దెను అధిరోహించినా.. అది మూన్నాళ్ల ముచ్చటిగానే మిగిలిపోయింది. కేవలం 49 రోజులు మాత్రమే సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ఆ పదవికి రాజీనామా చేసి బయటకొచ్చారు. ఆ తరువాత ప్రధాన పార్టీలు ఢిల్లీ గద్దెనెక్కడానికి యత్నించినా అక్కడ రాష్ట్రపతి పాలనే అనివార్యమైంది.
అయితే 2015 ఫిబ్రవరి 7వ తేదీన ఢిల్లీకి మరోసారి జరిగిన ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఫిబ్రవరి 10వ తేదీన విడుదలైన ఫలితాల్లో ఆప్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నద్ధమయ్యింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పదవి చేపట్టిన కేజ్రీవాల్ 2014 ఫిబ్రవరి 14వ తేదీన ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే మరోసారి ఢిల్లీకి జరిగిన ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన కేజ్రీవాల్ అదే తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితుల్లో వేరైనా తేదీలు మాత్రం ఒకటే. ఇది యాధృచ్చికంగా జరిగిందని భావించినా.. ఆ తేదీ కేజ్రీవాల్ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందనే వాస్తవాన్ని మాత్రం అంగీకరించాలి.