తమ తప్పిదం లేకపోయినా అధికారుల అలసత్వం కారణంగా ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోల్పోయామంటూ ముగ్గురు విద్యార్థినులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థినులు
సాక్షి, న్యూఢిల్లీ: తమ తప్పిదం లేకపోయినా అధికారుల అలసత్వం కారణంగా ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోల్పోయామంటూ ముగ్గురు విద్యార్థినులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిని న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గతేడాది వైద్య కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాలో సీట్లు పొందేందుకు వీలుగా శాప్ సదరు విద్యార్థులకు సకాలంలో ప్రాధాన్యతలు కేటాయించలేదని, దీంతో వారు ప్రవేశాలు కోల్పోయారని వివరించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు.
అయితే అప్పటికే కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయిందని, విద్యార్థుల తప్పిదం లేకపోయినా అన్యాయంగా ప్రవేశాలు కోల్పోయారని, అందువల్ల వీరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని శాప్‌ను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిందని వివరించారు. కానీ విద్యార్థులకు పరిహారం కంటే కూడా వారి భవిష్యత్తుకు సంబంధించిన ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపే ముఖ్యమని వాదించారు. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణకు వీలుగా కేసును మే 11కు వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.