
మంత్ర దండం లేదు కానీ.. మంచి చేస్తాను
నిజాయితీగల అధికారులు తోడుంటే సాధ్యంకానిది లేదు: అరవింద్ కేజ్రీవాల్
అలాంటిఅధికారులందరూ మమ్మల్ని ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిళ్ల ద్వారా సంప్రదించండి
ఢిల్లీ ప్రజలకు సేవ చేసేలా తగిన స్థానంలో మిమ్మల్ని నియమిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: సమస్యలన్నీ పరిష్కరించేందుకు తన దగ్గర మంత్రదండమేదీ లేదని, అయితే నిజాయితీపరుల సహకారం లభిస్తే అసాధ్యమనేది ఉండదని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నిజాయితీపరులు, సమర్థులైన అధికారుల సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలో నిజాయితీపరులైన అధికారులు, ఉద్యోగులు తనను ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిళ్ల ద్వారా సంప్రదించాలని కేజ్రీవాల్ కోరారు.
ఢిల్లీ సమస్యలు పరిష్కరించడానికి వీలుగా వారిని తగిన స్థానాల్లో నియమిస్తామన్నారు. గురువారం కూడా ఆయన కౌశంబీలోని తన నివాసం వద్ద ‘జన సభ’ను నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నిజాయితీపరులైన అధికారుల సహకారం లభించినట్లయితే తాము అవినీతిరహిత పాలనను అందించగలమన్నారు. అలాంటి అధికారులను ఎలా గుర్తిస్తారని అడిగిన ప్రశ్నకు తమకు నెట్‌వర్క్ ఉందని, దాని ద్వారా నిజాయితీపరుల గురించి తెలిసిపోతుందన్నారు. ప్రస్తుతం విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న రాజేంద్రకుమార్ వంటి అధికారులతో కూడిన బృందం నిజాయితీపరులు, సమర్థులైన అధికారుల ఆచూకీ తీస్తోందన్నారు.
అధికారాన్ని చేపట్టిన వెంటనే ఆ హామీ అమలు: అధికారాన్ని చేపట్టిన తరువాత 700 లీటర్ల నీటిని సరఫరా చేసే హామీతోపాటు మిగిలిన హామీలను వీలైనంత త్వరగా అమలుచేస్తామని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అవసరమైనప్పుడు ఐఐటీ, ఐఐఎం నిపుణుల బృందం సలహా తీసుకోనున్నట్లు చెప్పారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చే వారిలో ప్రముఖులెవరూ ఉండరని, ఈ కార్యక్రమానికి సామాన్యులందరూ రావొచ్చని ఆయన ఆహ్వానించారు.
సామాజిక సేవా కార్యకర్త అన్నాహజారే తన గురువని, ప్రమాణ స్వీకారానికి రావలసిందిగా ఆయనను ఫోన్‌లో కోరతానని కేజ్రీవాల్ చెప్పారు. కాగా, జనసభలో పాల్గొన్న వారిలో చాలా మంది కేజ్రీవాల్‌కు అభినందనలు తెలపగా కొందరు సలహాలు ఇచ్చారు. ఢిల్లీవాసులు నీటి సరఫరా, విద్యుత్తుకు సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు తన నివాసం వద్ద భద్రత కోసం వచ్చిన పోలీసులను కేజ్రీవాల్ గురువారం వెనక్కి పంపారు. తనకు భద్రత అక్కర్లేదని చెప్పారు.
‘ఆప్’ ఖాతాలను తనిఖీ చేయనున్న హోంశాఖ
ఆప్ విదేశీ విరాళాలపై సందేహాల నివృత్తి కోసం ఆ పార్టీ ఖాతా పుస్తకాలను తనిఖీ చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఆప్‌కు అందిన విదేశీ విరాళాల గురించి హోంశాఖ లేఖలు రాయగా వాటికి ఆ పార్టీ ఇచ్చిన జవాబులపై కొన్ని అనుమానాలు కలిగినందున ఖాతా పుస్తకాలు తనిఖీ చేయనుంది. విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం కింద తామడిగిన ప్రశ్నలకు ‘ఆప్’ ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేనందుకే ఈ చర్య చేపట్టనుంది. ఒక పిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ తనిఖీ జరగనుంది.
లోక్‌సభ ఎన్నికలకు ఆప్ సన్నాహాలు
ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో విజయోత్సాహంలో ఉన్న ‘ఆప్’... లోక్‌సభ ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభించింది. వివిధ రాష్ట్రాలతో పార్టీ బలాబలాలను అంచనా వేసేందుకు పంకజ్ గుప్తా, సంజయ్ సింగ్‌లతో రాజకీయ సబ్‌కమిటీని నియమించింది. అయితే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేయడంపై పార్టీ ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని ‘ఆప్’ నేత యోగేంద్ర యాదవ్ గురువారం మీడియాతో చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ‘ఆప్’ తరఫున పోటీ చేయాలనుకుంటున్న వారి కోసం పార్టీ గురువారం ఒక ఫామ్ విడుదల చేసింది. వీటిని దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో గల ‘ఆప్’ కార్యాలయాల్లో ఇస్తున్నట్లు యాదవ్ తెలిపారు. ఈ ఫామ్‌ను ఆన్‌లైన్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు తాము పోటీ చేయదలచిన లోక్‌సభ స్థానంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తమ అభ్యర్థిత్వానికి మద్దతుగా వంద చొప్పున సంతకాలను సేకరించి, దరఖాస్తు ఫామ్‌కు జతచేయాల్సి ఉంటుందని తెలిపారు.