ఆ షాపుల్లో... చాక్లెట్లు, కూల్‌డ్రింక్‌లకు ‘నో’ | No more Selling of Chocolates and Cool drinks in Pan Shops, says Centre | Sakshi
Sakshi News home page

పాన్‌షాపుల్లో... చాక్లెట్లు, కూల్‌డ్రింక్‌లకు ‘నో’

Published Wed, Sep 27 2017 10:52 PM | Last Updated on Thu, Sep 28 2017 3:14 AM

No more Selling of Chocolates and Cool drinks in Pan Shops, says Centre

భావితరాలను పొగాకు వ్యసనానికి దూరంగా ఉంచేందుకు కేంద్రం ప్రభుత్వం మరో చర్య చేపట్టింది. సిగరెట్లు, బీడీలు, ఖైనీ, గుట్కాలను అమ్మే షాపులు స్థానిక సంస్థల వద్ద రిజిస్టర్‌ చేసుకొని... విక్రయాలకు అనుమతి పొందాలని ప్రతిపాదించింది. అలాగే మైనర్లు వీటి పట్ల ఆకర్షితులు కాకూడదనే ఉద్దేశంతో పాన్‌షాపుల్లో చాక్లెట్లు, బిస్కట్లు, చిప్స్, కూల్‌డ్రింక్స్‌ లాంటివి అమ్మకూడదని స్పష్టం చేసింది. పొగాకు ఉత్పత్తులు అమ్మే షాపులకు స్థానిక సంస్థల ద్వారా అనుమతిని జారీచేసే ప్రక్రియకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని కోరుతూ ఈనెల 21న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. దేశవ్యాప్తంగా మైనర్లకు పొగాకు ఉత్పత్తుల అమ్మకుండా ఓ కన్నేసి ఉంచడానికి ఈ విధానం పనికి వస్తుందని ఆరోగ్యశాఖ సలహాదారు అరుణ్‌ ఝా అన్నారు. అయితే మన దేశంలో పాన్‌షాపుల్లో కాకుండా ప్రతిచిన్న కిరాణా కొట్టులోనూ సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్ముతారు. వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి.

ప్రపంచ వ్యాప్తంగా పొగతాగే వారిలో 90 శాతం మందికి 20 ఏళ్ల వయసులోపే దమ్ము అలవాటైందని గణాంకాలు చెబుతున్నాయి. మొక్కగా ఉన్నపుడే వంచడం సులువు కాబట్టి యుక్త వయసులో అటు వైపు ఆకర్షితులు కాకుండా నిరోధిస్తే... ఈ మహమ్మారి బారినపడకుండా యువ శక్తిని కాపాడుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది.

– భారత్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరికి పొగాకు నమిలే అలవాటు ఉందని ప్రభుత్వ సర్వే తేల్చింది.
– 10 కోట్లు: భారత్‌లో పొగాకు తాగే అలవాటు ఉన్నవారు.
– 1 కోటి: పొగాకు తాగే అలవాటు కారణంగా... క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధం వ్యాధుల బారినపడి ప్రతియేటా మనదేశంలో మరణించే వారి సంఖ్య.
– 60 శాతం నివారించొచ్చు: క్యాన్సర్లలో 60 శాతం నివారించదగ్గవే. వీటిలో పొగాకు సంబంధింత క్యాన్సర్లు 40 శాతం.
– 16 ఏళ్లు: భారత్‌లో పొగాకు అలవాటుపడుతున్న పిల్లలు 16 ఏళ్ల సగటు వయసులో దీన్ని మొదలుపెడుతున్నారు.
– 4.4 శాతం: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన గ్లోబల్‌ అడల్ట్‌ టొబాకో సర్వే (గాట్స్‌) నివేదిక ప్రకారం 2010 నుంచి 2016 మధ్యకాలంలో 15–17 ఏళ్ల మధ్యలో  పొగాకుకు అలవాటుపడుతున్న వారి సంఖ్య 9.6 శాతం నుంచి 4.4 శాతానికి పడిపోయింది.
– 15.4 శాతం: ఇదే కాలంలో 18–24 ఏళ్ల వయసు వారిలో పొగాకు అలవాటున్న వారి శాతం 21.4 నుంచి 15.4 శాతానికి పడిపోయింది. ప్రజారోగ్యానికి సంబంధించి ఇదో ఆరోగ్యకర పరిణామంగా భావించిన కేంద్రం... యువతను ఈ అలవాటుకు దూరంగా ఉంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో తాజా చర్యలు చేపట్టింది.
– 7 ఏళ్లు: 2015లో ఆమోదించిన జువనైల్‌ చట్టం ప్రకారం... మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే గరిష్టంగా ఏడేళ్ల దాకా కఠినకారాగార శిక్షను విధించే అవకాశముంది.
100 మీటర్లు: విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలోపు పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదు.
– 4వ స్థానం: ప్రపంచంలో అత్యధికంగా సిగరెట్లు అమ్ముడయ్యే దేశాల్లో భారత్‌ది నాలుగోస్థానం. చైనా, అమెరికా, జపాన్‌ల తర్వాత మనమున్నాం.
9,900 కోట్లు: 2016లో భారత్‌లో అమ్ముడైన సిగరెట్ల సంఖ్య.
51 శాతం: ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ల వినయోగంలో టాప్‌–4 దేశాలు ( చైనా, అమెరికా, జపాన్, భారత్‌)  ఏకంగా 51 శాతం వినియోగిస్తున్నాయి.
11.2 శాతం: ప్రపంచవ్యాప్తంగా మొత్తం పొగరాయుళ్లలో భారతీయులు 11.2 శాతం.
– ఈ ఏడాది విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానంలో 2020 కల్లా పొగాకు వినియోగాన్ని 15 శాతం తగ్గించాలని, 2025 కల్లా 30 శాతం తగ్గించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement