
దేశ ప్రగతికి పల్లెలే పట్టుకొమ్మలు. అందుకే మనదేశంలో మంచి పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తూ.. అభివృద్ధిలో ఒక అడుగు ముందుకేసి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలెన్నో ఉన్నాయి. మరోపక్క వివిధ రకాల కారణాలతో అభివృద్ధికి నోచుకోని గ్రామాలూ ఉన్నాయి. అయితే వీటన్నింటికి భిన్నంగా ఇప్పటికీ.. సర్పంచ్ లేకపోయినా.. ఓ గ్రామం ఒడిదుడికులన్నింటిని అధిగమిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లా, కరేలి మండలంలో భగువర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాక సర్పంచ్ పదవికి ఎన్నిక జరగలేదు. గ్రామంలోని పెద్దను సామూహికంగా నిర్ణయించి, పెద్ద నిర్ణయాలతో ముందుకు సాగుతారు భగువర్ గ్రామ ప్రజలు. 1962లో గ్రామ పంచాయతీ భవనాన్నీ నిర్మించారు. అయితే ఈ భవనాన్ని ఒక దేవాలయంగా భావిస్తారు వారంతా. సర్పంచ్ లేక పోయినా గ్రామస్వరాజ్యం సాధించడంలో భగువర్ గ్రామం ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
గ్రామం మొత్తం అభివృద్ధిని పరిశీలిస్తే... ఆదర్శ గ్రామాలైన.. రాలేగావ్ సిద్ధి, హివారే బజార్, గంగదేవిపల్లి గ్రామాల అభివృద్ధి కంటే కొన్ని వందల రెట్లు భగువర్ గ్రామం ముందంజలో ఉంది. మొదట్లో గ్రామానికి చెందిన నిర్ణయాలు ఆ గ్రామం లోని పెద్ద, మర్యాదస్తుడుగా అందరూ గౌరవించే ‘‘భయ్యాజీ’’ తీసుకునే వారు. భయ్యాజీ కష్టపడేతత్వం చూసిన గ్రామస్తులు ఆయన అడుగు జాడల్లో నడిచి గ్రామ అభివృద్ధికి కృషి చేశారు. 2012 లో భయ్యాజీ మరణించినా, ఇప్పటికి ఆయన మార్గంలోనే గ్రామస్తులంతా నడుస్తున్నారు.
అత్యుత్తమ నీటి వ్యవస్థ..
దేశంలోనే అత్యుత్తమ మురుగు నీటి వ్యవస్థ ఈ గ్రామంలో ఉంది. మురుగునీరు రోడ్లపై పారకుండా భూగర్భ కాలువ వ్యవస్థ ఉంది. వర్షపు నీరు, వృథాగా పోయే నీరు నిల్వ చేయడానికి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఉన్నాయి. దీంతో భూగర్భ జలాలు తగినంత స్థాయిలో ఉన్నాయి.
ఏ భేదం లేకుండా...
గ్రామ పాఠశాలలో కుల, మతాలతో సంబంధం లేకుండా అందరు విద్యార్థులు కలిసి చదువుకుంటారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఇటువంటి గ్రామాలు జిల్లాకో రెండు ఉన్నా.. దేశం అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకుపోతుంది. ఇంతటి గొప్ప అభివృద్ధి కలిగిన భగువర్ గ్రామంపై ‘‘స్వరాజ్ ముమ్‌కిన్ హై’’ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ కూడా తీశా>రు. ఈ డాక్యుమెంటరీకి అవార్డు కూడా లభించడం విశేషం.
అత్యధిక గోబర్ గ్యాస్ ప్లాంట్లు...
దేశంలోనే అత్యధిక గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఉన్న గ్రామంగా భగువర్ రికార్డు సృష్టించింది. ఈ గ్రామ జనాభా 1700 లకు పైగా ఉంటుంది. సుమారు 400 ఇళ్లు ఉన్నాయి. గ్రామం మొత్తం మీద 51 గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి సాయంతోనే వంట గ్యాస్‌ను, వీధి లైట్లను వెలిగిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం భగువర్ గ్రామంలో నిషేధించారు. గ్రామంలో సేకరించిన చెత్తనంతా ఒకచోట పెద్ద గుంతలో వేసి ఎరువుగా తయారు చేస్తారు. ఈ ఎరువును ఏడాదికి ఒకసారి వేలం వేసి, వచ్చిన సొమ్మును గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నారు.
సొంతంగా రోడ్ల నిర్మాణం...
భగువర్‌కు మొదట్లో సరైన రహదారి ఉండేదికాదు. గ్రామంలోని యువకులంతా కలిసి మూడు కిలో మీటర్ల మేర రోడ్డును స్వయంగా నిర్మించారు. అది గుర్తించిన ప్రభుత్వం తర్వాత సిమెంటు రోడ్డు నిర్మించింది. భగువర్‌లో 35 ట్రాక్టర్లు, 75 చెరుకు గడల ప్రాసెస్ మిషన్లు, అందరూ వాడుకునేందుకు 25 చేతి పంపులు ఉన్నాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, ఏదైనా సమావేశాలు, పండగలు, ఫంక్షన్లు నిర్వహించినప్పుడు వాడుకోవడానికి జనరల్ టాయిలెట్స్ కూడా నిర్మించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment