వారణాసి: దేశాభివృద్ధే బీజేపీకి ముఖ్యమని, ఓట్ల కోసం ఆ పార్టీ రాజకీయాలు చేయదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం ఆయన భారీ పశు ఆరోగ్య మేళా ప్రారంభించారు. ఓట్లు వస్తాయనుకుంటేనే కొందరు రాజకీయ నాయకులు పనిచేస్తారని తర్వాత బహిరంగ సభలో విపక్షాల తీరును ఎండగట్టారు. ‘దేశ సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం. మా రాజకీయాలు ఓట్ల కోసం కాదు. అభివృద్ధే మాకు ముఖ్యం.
మా సంస్కృతి వేరు. పరిపాలన అంటే రాజకీయాలు, ఎన్నికల్లో గెలవడం కాదు’ అని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రధాన మంత్రి అవాస్ యోజన ధ్రువీకరణ పత్రాల్ని మోదీ అందచేశారు. 2022 నాటికి దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోనున్న వేళ పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే భేదం లేకుండా ప్రతీ పేద వ్యక్తికి సొంత ఇల్లు ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. కోట్లాదిమందికి సొంతిళ్లు లేవని, ఇంతటి కష్టసాధ్యమైన పనికి మోదీ పూనుకోకుంటే ఇంకెవరు చేస్తారన్నారు.
‘2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు కోసం కృషి చేస్తామని వాగ్దానం చేశాం. రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం కృషి కొనసాగిస్తోంది. ఇతర ఆదాయ మార్గాలుగా పాల ఉత్పత్తి, పశువుల పెంపకాన్ని ప్రత్యామ్నాయాలుగా చేసుకునేలా రైతుల్ని ప్రోత్సహించాలి. అలాంటి చర్యలతో సరికొత్త ప్రగతికి బీజాలు పడతాయి’ అని అన్నారు. ‘పశుధన్ ఆరోగ్య మేళాతో ఉత్తరప్రదేశ్‌లోని రైతులంతా లబ్ధి పొందుతారు. ఇలాంటి మేళాలు, ప్రదర్శనలు పశువులకు సరైన వైద్యం చేయించలేని పేద రైతులకు ఉపయోగకరం’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు.
మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రాజెక్టులో భాగంగా గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ‘స్వచ్ఛత ఒక పూజ. అది దేశ ప్రజల్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. మరుగుదొడ్ల శంకుస్థాపన ప్రాంతానికి ఇజ్జత్‌ఘర్(గౌరవప్రదమైన ఇల్లు) అని పేరుపెట్టడాన్ని అభినందించారు.
ప్రజల ప్రతీ పైసా వారికే..
అవినీతిపరులు, నల్లకుబేరుల దోపిడీతో పేదలు ఎన్నో ఇక్కట్లు పడ్డారని, అందుకే కేంద్రం నల్లధనం, అవినీతిపై యుద్ధం ప్రారంభించిందని చెప్పారు. ‘ప్రస్తుతం నిజాయితీ కోసం సాగుతున్న ఉద్యమం ఉత్సవంలా ముందుకు పోతోంది. జీఎస్టీ అమలు, ఆధార్ అనుసంధానంతో వర్తక సోదరులు ఆ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ప్రజల ప్రతీ పైసా వారి సంక్షేమానికే ఖర్చుచేస్తాం’ అని అన్నారు.