నోట్ల వెతల్లో స్ఫూర్తి కథలు కూడా..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని, అవి చిత్తు కాగితాలతో సమానమని ప్రకటించడంతో మధ్యతరగతి, కార్మికుల కష్టాలు ప్రారంభమైన విషయం తెల్సిందే. చిన్న దుకాణాల నుంచి పెద్ద మాల్స్ వరకు, పాలు, కూరగాయల నుంచి పెట్రోలు బంకుల వరకు అటు నిషేధించిన నోట్లు తీసుకోవడానికి, ఇటు అరువు ఇవ్వడానికి నిరాకరించడంతో కన్నీళ్లు పెట్టుకున్న కార్మికుల కథలెన్నో వింటున్నాం.
అదే సమయంలో తోటి వారి అవస్థను అర్థం చేసుకొని సహకరించిన స్ఫూర్తిదాయక కథలు కూడా ఉన్నాయి. ఉంటాయి. ఓలా డ్రైవర్ విపిన్ కుమార్ స్ఫూర్తిదాయకంగా వ్యవహరించిన కథ కూడా అలాంటిదే. ఢిల్లీకి చెందిన ఆర్కిటెక్ట్ విప్లవ్ ఆరోరా బుధవారం రాత్రి అర్జంట్‌గా ఊరెళ్లాల్సి వచ్చి రైల్వే స్టేషన్‌కు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు. జేబులో అన్ని 500 రూపాయల నోట్లే ఉండడంతో కంగారు పడ్డారు. తన ఓలా అకౌంట్‌లో కొంత సొమ్మున్న విషయం గుర్తొచ్చి ఫర్వాలేదనుకున్నారు. తీరా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక బిల్లు చూస్తే ఓలా అకౌంట్లో ఉన్న దానికంటే చాలా ఎక్కువైంది. ఏం చేయాలో తోచక కంగారు పడ్డారు.
‘ఏం ఫర్వాలేదుసార్. ఓలా యాజమాన్యం నుంచి వచ్చే నా కమిషన్‌ను వదులుకుంటాను. ఈరోజు డబ్బులు తక్కువ సంపాదించానని సర్దుకుంటా. నాలాంటి బడుగు జీవికి డబ్బులు చాలకపోతే కష్టమే. మోదీ తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్లన దేశంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని వింటున్నాను. ఫర్వాలేదు, వారిలో నేనొకరిని. మోదీ మంచి నిర్ణయం తీసుకున్నందున నేను ఇబ్బంది పడ్డా ఫర్వాలేదు. దేశ సంక్షేమం కోసం నేను కొంత సాయం చేశానని తృప్తి పడతాను. మీరు ఎలాంటి ఫికర్ పెట్టుకోకుండా సుఖంగా జర్నీ చేయండిసార్!’ అని ఓలా క్యాబ్ డ్రైవర్ విపిన్ కుమార్, విప్లవ్ ఆరోరాతో హిందీలో వ్యాఖ్యానించారట.
ఈ విషయాన్ని ఆరోరా ఓలా ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయగా ఎంతో మంది యూజర్లు దాన్ని షేర్ చేసుకొని కుమార్‌ను అభినందించారు. ఓలా యాజమాన్యం కూడా స్పందించి తమ ఓలా గ్రూప్‌లో కుమార్ లాంటి డ్రైవర్ ఉన్నందుకు గర్విస్తున్నామని, ఈ ట్రిప్పులో తాను కోల్పోయిన సొమ్మును అతనికే అందజేస్తామని అరోరాకు హామీ కూడా ఇచ్చింది.