పెద్దనోట్లు రద్దు వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని మాజీ ఎంపీ రమ్య అన్నారు.
బెంగళూరు : పెద్ద నోట్లు రద్దు వల్ల దేశంలో ఎక్కడ చూసినా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని మాజీ ఎంపీ, నటి రమ్య ఆరోపించారు. రమ్య నిన్న మీడియాతో మాట్లాడుతు. కేంద్ర ప్రభుత్వం రూ. 500,1000 నోట్లు రద్దు చేసే ముందు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదన్నారు. దాని వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రమ్య ఆరోపించారు.
దేశంలో ఉన్న నల్లధనం బయటికి తీయడం అనేది చాల మంచి విషయమని, అయితే ఇలాంటి పెద్ద సమస్యలను సృష్టించే పనులు చేసే ముందు సామాన్య ప్రజలకు, పేదలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో కూలి పనులు చేసుకునే కార్మికులు పనులు మాని బ్యాంకుల ముందు రోజుల తరబడి క్యూలో ఉంటున్నారని ఇలా రోజుల చొప్పున వృథా అయితే వారికి తిండి ఎక్కడి నుంచి వస్తుందని రమ్య ఆరోపించారు.
నల్లధనం బయటికి తీయడానికి కేంద్రం గడిచిన 10 నెలల నుంచి ఈ పథకం అమలు చేయడానికి ప్రణాళిక సిద్దం చేసిందని అంటున్నారని, అయితే కొత్తగా ముద్రించిన నోట్ల పైన ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ సంతకం ఎలా వచ్చిందని, అది ఎలా సాధ్యమయిందని రమ్య అన్నారు. కేంద్రం ఇందులో కూడ రాజకీయం చేసిందని, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఈ విషయం బయటికి రాక ముందు బీజేపీ ఖాతాకు పెద్ద ఎత్తున నగదు మార్పు చేయడం జరిగిందని రమ్య ఆరోపించారు.