శివాజీ స్మారకానికి మోదీ జలపూజ
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహాలు
♦ ముంబై తీరానికి 1.5 కి.మీ. దూరంలో ఏర్పాటు
ముంబై: ముంబై తీరానికి సమీపంలో సముద్రంలో నిర్మించ తలపెట్టిన ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ స్మారక ( ఎత్తు192 మీటర్లు) నిర్మాణానికి శనివారం ప్రధాని మోదీ జలపూజ చేశారు. దక్షిణ ముంబైలోని తీరం నుంచి 1.5 కి.మీ దూరంలో రూ.3,600కోట్లతో ఈ స్మారకాన్ని నిర్మించనున్నారు. గిరుగావ్ చౌపట్టి బీచ్ నుంచి హోవర్‌క్రాఫ్ట్ (కోస్టుగార్డు ప్రత్యేక నౌక)లో అరేబియా సముద్రంలోని స్మారకం నిర్మించే ప్రాంతానికి వెళ్లి జలపూజ చేశారు. మహారాష్ట్రలోని అన్ని జిల్లాలనుంచి తీసుకొచ్చిన మట్టి, వివిధ నదుల నుంచి తీసుకొచ్చిన నీరు నింపిన కలశాలను మోదీ సముద్రంలో విసర్జనం చేశారు.
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవిస్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతోపాటు ఛత్రపతి శివాజీ వారసులు ఉదయన్ రాజే, శంభాజీ రాజే (ఇద్దరూ ఎంపీలే) మోదీతో పాటు హోవర్‌క్రాఫ్ట్‌లో వెళ్లారు. ఈ స్మారకంలో శివాజీ విగ్రహం, మ్యూజియం, ఆడిటోరియం, రంగస్థల వేదిక, ఎగ్జిబిషన్ గ్యాలరీ ఉంటాయి. శివాజీ స్మారకానికి శంకుస్థాపన చేయటం నా అదృష్టం. అందరూ శివాజీ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని తర్వాత జరిగిన కార్యక్రమంలో మోదీ అన్నారు. అనంతరం లక్షా ఆరు వేల కోట్లతో ముంబై డీఎన్ నగర్– బీకేసీ–మాన్ ఖుర్ద్ (మెట్రో–2), వడాల–ఘట్కోపర్–ములుండ్– థానే–కాసార్ వడవలి (మెట్రో–4) తదితర కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు.