కటకటాల పాలైన యువ ఐఏఎస్
పాట్నా: అతను దేశ అత్కున్నత సివిల్ సర్వీసు ఉద్యోగి. బిహార్లో సబ్ డివిజనల్ ఆఫీసర్ గా మొదటి పోస్టింగ్. ఉన్నత కెరీర్ ఆయన ముందుంది. కానీ అవినీతికి పాల్పడి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన బిహార్ లోని కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది. 2013 సివిల్ సర్వీస్ బ్యాచ్ కు చెందిన జితేంద్ర గుప్తా కైమూర్ జిల్లాలో సబ్ డివిజనల్ ఆఫీసర్ గా మొదటి పోస్టింగ్ అందుకున్నాడు.
జులై 4న రాజస్థాన్ నుంచి జంషెడ్ పూర్ కు ఇనుప ఖడ్డీలతో కూడిన రెండు ట్రక్కులు ఓవర్ లోడ్ తో వెలుతున్నాయి. వాహనాలను అడ్డుకున్న గుప్త రూ 1.5 లక్షలు ఓనర్ నుంచి డిమాండ్ చేశాడు. చివరికి రూ 80,000 లకు బేరం కుదుర్చుకున్నాడు. గుప్తాపై ట్రక్కు యాజమాని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఐఏఎస్ అధికారి ట్రక్ డ్రైవర్ నుంచి లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు వలవేసి గుప్తాను పట్టుకున్నారు. 14 రోజుల రిమాండ్ కు తరలించారు. బిహార్ చరిత్రలోనే లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కి జైలు కెళ్లిన మొదటి ఐఏఎస్ అధికారిగా గుప్త రికార్డు సృష్టించాడు.