దొంగచాటు దాడి ఎందుకు?: కేజ్రీవాల్
బీజేపీ తనకు 5 ప్రశ్నలు సంధించడంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. తెరచాటున దాక్కొని దాడి చేయొద్దని, తన బహిరంగ చర్చ సవాలును స్వీకరించి ప్రజలడిగే ప్రశ్నలకు జవాబివ్వాలని గురువారం బీజేపీని సవాలు చేశారు. ‘బహిరంగ చర్చకు రమ్మంటూ చాన్నాళ్లుగా అడుగుతున్నాను. దాక్కుని ప్రశ్నలడగడం ఎందుకు? బహిరంగంగా చర్చిద్దాం. రండి’ అని మరోసారి ఆహ్వానించారు.
మేనిఫెస్టోకు బదులుగా దార్శనిక పత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్న బీజేపీ నిర్ణయాన్ని విమర్శిస్తూ.. ‘మేనిఫెస్టో లేదంటే.. ఢిల్లీ ప్రజలకు సంబంధించి వారి వద్ద ఎలాంటి ఎజెండా లేదని అర్థం’ అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ కార్యకర్తలకు డబ్బు ఆశ చూపి ప్రలోభపెడుతున్నాయని ఆరోపించారు. ఎవరైనా డబ్బు ఆశ చూపి కొనడానికి ప్రయత్నిస్తే స్టింగ్ ఆపరేషన్ జరపాల్సిందిగా కార్యకర్తలకు సూచించారు.