
అధికార పక్షంపై ఆగ్రహం
అన్నాడీఎంకే ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా తయారైందంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా పాల ధర, విద్యుత్ చార్జీల పెంపుపై విరుచుకుపడుతున్నాయి. ఎవరికి వారు బహిరంగ విమర్శలు చేయడం మొదలు పెట్టారు. దీంతోపాటు ఆందోళనకు సన్నద్ధం అవుతున్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: యాధృచ్ఛికమో లేక మరేదైనా కారణమోగానీ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోరాటాలు జరిపేందుకు ప్రతిపక్షాలకు పెద్దగా అవకాశం దొరికేది కాదు. పార్టీ సమావేశాల్లో విమర్శలేగానీ బహిరంగ ఆందోళనలకు వారికి బల మైన అంశాలే కరువయ్యూయి. అమ్మ జైలు పాలుకావడం తో అప్రతిహతంగా సాగుతున్న అన్నాడీఏంకే పాలనలో అధికార పక్షంపై ఆగ్రహం
35: నిరసనకు తరలి వచ్చిన డీఎండీకే వర్గాలు
36: ఓ అభిమాని వినూత్నం
37: పాల ప్యాకెట్ కవర్లతో నిరసన
అపశ్రుతులు ఆరంభమయ్యూయి. రాజ్యాంగపరంగా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా మారినా ప్రజలు, ప్రతి పక్షాలను నమ్మించలేక పోతున్నారు. అమ్మకు వీర విధేయుడేగానీ ప్రజలకు కాదనే అపవాదును మూటగట్టుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాలు, విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం అన్నాడీఎంకే పాలనకు శరాఘాతమైంది. ఆవిన్ పాలు లీటరు రూ.24 నుంచి రూ.34 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ధర నవంబరు 1 నుంచి అమల్లోకి రానుంది. అలాగే విద్యుత్ చార్జీలను సైతం పెంచేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అధికార పార్టీని దుమ్మెత్తిపోయడానికి అదునుకోసం వేచి ఉన్న ప్రతిపక్షాలకు పదునైన అస్త్రంగా మారింది. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అమ్మ అప్రతిష్టపాలై ఉన్న బలహీన క్షణాల్లోనే బలమైన దెబ్బతీయాలని విపక్షాలు సిద్ధమవుతున్నాయి. వచ్చె నెల నుంచి ప్రజలకు పెనుభారంగా మారనున్న పాల ధర, విద్యుత్ చార్జీల పెంపును భుజాలకెత్తుకుని ఆందోళనలకు దిగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో తోలుబొమ్మ పరిపాలన సాగుతోందంటూ డీఎంకే కోశాధికారి స్టాలిన్ విమర్శలు చే స్తూ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ సైతం మంగళవారం చెన్నై వళ్లువర్ కోట్టం వద్ద పోరాటబాట పట్టారు. పాల ధరను పెంచకుండా, ఆవిన్ పాల కల్తీకి పాల్పడి కోట్లు ఆర్జించిన వైద్యనాథన్ ఆస్తులు స్వాధీనం చేసుకుంటే సరిపోతుందని విజయకాంత్ వ్యాఖ్యానించారు. వచ్చేనెల 15 నుంచి 35 శాతం విద్యుత్ చార్జీలు కూడా పెరగనున్నాయన్నారు. పెంచిన ధరలను పూర్తిగా ఉపసంహరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ప్రజా సమస్యల కోసం జైలు కెళ్లడానికి తాను సిద్ధమని కెప్టెన్ వ్యాఖ్యానించారు. పాలు, విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31న వల్లువర్‌కోట్టం వద్ద ఆందోళన నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్ మంగళవారం ప్రకటించారు. ప్రభుత్వం వెనక్కు తగ్గకుంటే నవంబరు మొదటి వారంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఇవే అంశాలపై వచ్చేనెల 5 వ తేదీన ఆందోళన చేపట్టనున్నట్లు పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ మంగళవారం ప్రకటించారు.
16 నుంచి కొత్త కార్డులు
ఆవిన్ పాల ధర పెంపుపై అన్ని పార్టీలు ఆందోళనలు సాగిస్తుండగానే అధికారులు తమపని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆవిన్ పాల వినియోగదారులకు ప్రతి నెలా 16 నుంచి మరుసటి నెల 15 వరకు కార్డులు జారీ చేయడం ఆనవాయితీ. ఈనెల ఆవిన్ కార్డును కొనుగోలు చేసుకున్న వారు వచ్చేనెల 1 నుంచి పెంచిన అదనపు ధరను చెల్లించాలని ఆవిన్ యాజమాన్యం ప్రకటించింది. నవంబరు 16న పెంచిన ధరకు అనుగుణంగా కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. అంటే పాత ధరపై కార్డును కొనుగోలు చేసిన వారు సైతం కొత్త ధరను చెల్లించక తప్పదని ఆవిన్ వారు స్పష్టం చేస్తున్నారు.