బెంగళూరు: అతికిరాతకంగా భార్యను హత్య చేసి 15 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న ఓ ప్రబుద్ధుడికి పోలీసులు చెక్ పెట్టారు. పేరు మార్చుకుని ప్రముఖ ఐటీ కంపెనీ ఒరాకిల్‌లో ఉద్యోగం వెలగబెడుతూ, సంవత్సరానికి రూ. 22 లక్షల జీతంతో దర్జాగా బతుకుతున్న తరుణ్ కుమార్ జినారాజ్, అలియాస్ ప్రవీణ్ (42) చివరకు కటకటాల వెనక్కి వెళ్లాడు.
వివరాల్లోకి వెళ్లితే.. అహ్మదాబాద్ వాసి తరుణ్‌కు, బ్యాంకు ఉద్యోగి సాజ్నితో నవంబరు 15, 2002న వివాహం జరిగింది. కానీ పెళ్లయిన నాలుగు నెలలకే (2003 ఫిబ్రవరి,14) ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. పైగా చోరీకి వచ్చిన దొంగలు ఆమెను హత్య చేసారని అత్తమామలు సహా అందర్నీ నమ్మించాడు.
అయితే ఎన్నాళ్లనుంచో ఇతగాడికోసం గాలిస్తున్న పోలీసులు ఇటీవల తరుణ్ తల్లి అన్నమ్మని విచారించారు. ఆమె తరచూ బెంగళూరుకు వెళ్లి రావడంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టారు. ఇక్కడే బాబు పోలీసులకు చిక్కాడు. బెంగళూరు ఒరాకిల్ కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ ద్వారా అన్నమ్మకు వచ్చిన ఫోన్ కాల్స్ పోలీసులు కూపీ లాగగా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే విచారణ అధికారి కిరణ్ చౌదరికి ఒరాకిల్ ఆఫీసులో తరుణ్ ఆచూకీ అంత ఆషామాషీగా దొరకలేదు. చివరకు పాత ఫోటోల ద్వారా గుర్తించి, నాటకీయంగా డైరెక్టుగా తరుణ్ (ప్రవీణ్) క్యాబిన్ దగ్గరి కెళ్లి.."హలో తరుణ్, నీ కథ ముగిసింది ...లెట్స్ గో" అనడంతో ప్రవీణ్ అవాక్కయ్యాడు. మొదట్లో తిరస్కరించినా చివరికి నేరాన్ని అంగీకరించక తప్పలేదు. అంతేకాదు తన భార్య(నిషా)కు ఫోన్ చేసి తన అసలు స్వరూపాన్ని కూడా వివరించాడట.
ఎలా తప్పించుకున్నాడు?
మధ్యప్రదేశ్‌లోని మండౌరుకు చెందిన తన పాతస్నేహితుడి సర్టిఫికెట్లను దొంగిలించి ప్రవీణ్ భాట్లీగా అవతరించాడు. ఎవరూ గుర్తు పట్టలేనంతగా పూర్తిగా మారిపోయాడు. నకిలీ సరిఫికెట్లతో ముందు కొంతకాలం పుణేలో కాల్ సెంటర్లో పనిచేశాడు. అక్కడే 2009లో నిషాను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బెంగళూరు ఓరాకిల్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగంలో చేరాడు. నైట్ షిఫ్ట్‌లు మాత్రమే చేస్తూ తన గుట్టు ఎవరికీ తెలియకుండా గోప్యతను పాటించాడు. తల్లిదండ్రులు, తమ‍్ముడు కారు యాక్సిడెంట్‌లో చనిపోయాడని చెప్పి నమ్మించి మరీ నిషా పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
సాజ్ని తల్లితండ్రులు కృష్ణన్, రమణి కేరళలోని త్రిసూర్‌కు చెందినవారు. ఆ తరువాత వారు అహ్మదాబాద్‌లో సెటిల్ అయ్యారు. అక్కడే పుట్టి పెరిగిన సాజ్ని బ్యాంకులో పని చేస్తున్నారు. వీరి పరిచయం నాటికి అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో వాలీబాల్ కోచ్ గా పని చేసేవాడు తరుణ్. అప్పటికే సాజ్ని పనిచేస్తున్న బ్యాంకు పనిమీద ఒకటి రెండు సార్లు సాజ్ని ఇంటికి వచ్చాడు తరుణ్. ఈ క్రమంలో పెద్దల అంగీకారంతోనే సాజ్నిని పెళ్లి చేసుకున్నాడు.
తరుణ్ అరెస్ట్‌పై కృష్ణన్, తరుణ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డ చనిపోయిన తరువాత తమ జీవితం శూన్యంగా మారిపోయిందనీ, ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ బతికామని చెప్పారు. మొదట్లో మర్యాద ప్రవర్తనతో సాజ్ని భర్త, ఆ తరువాత పోలీస్ దర్యాప్తులో పోలీసులు తమను తప్పుదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తరుణ్ గొప్ప నటుడు అనీ, అతని ప్రవర్తన తమకు ఎపుడూ అనుమానాస్పదంగా కనిపించలేదని, తమని చూడగానే లేచి నిలబడుతూ చాలా నెమ్మదిగా, సంస్కారవంతంగా ఉండేవాడని తెలిపారు. అప్పటికే మరో మహిళతో సంబంధమున్న సంగతి కూడా తమకు తెలియదన్నారు. కానీ పెళ్లి తరువాత అనుకున్నంత అతను మంచివాడు కాదంటూ తన కూతురు బాధపడిందనీ, తన డబ్బంతా తరుణ్ బలవంతంగా లాగేసుకుంటున్నాడని వాపోయిందని కూడా గుర్తు చేసుకున్నారు.
పకడ్బందీగా హత్య
దొంగతనం జరిగినట్టుగా ఇల్లంతా చిందర వందర చేశాడు. బీరువాలోని వస్తువులన్నీ లాగి పడేశాడు. సాజ్ని మెడలోని బంగారం గొలుసును రెండు ముక్కలు చేశాడు. విమాన టికెట్లను, కొంత సొమ్మును కూడా కింద పడేశాడు. (మరునాడు ఆమె ట్రైనింగ్ కోసం బయలుదేరాల్సి ఉంది). ఆమె చున్నీతోనే ఉరిబిగించి చంపేసినట్టుగా సీన్ క్రియేట్ చేశాడు. గాయాలు, షాకుకు గురయ్యాననే పేరుతో సమీపంలోని ఆసుపత్రి ఐసీయూలో చేరాడు.
అనుమానం ఎక్కడ మొదలైంది
మరునాడు పోస్ట్‌మార్టం అనంతరం ఇంటికి తీసుకొచ్చిన సాజ్ని మృతదేహాన్ని చూసి ఆసుపత్రి నుంచి వచ్చిన తరుణ్ బోరున విలపిస్తూ మరోసారి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించాడు. కానీ సాజ్నీ మెడలోని చున్నీని వాసన చూసిన స్నిఫర్ డాగ్స్ మాత్రం అతగాడి వాసన పసిగట్టాయి. గట్టిగా అరవడం మొదలు పెట్టాయి. దీంతో అప్పటివరకూ సంస్కారవంతమైన అల్లుడిగా భావించిన కృష్ణన్ , రమణలకు అనుమానం మొదలైంది. తమ కూతురు చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి. అంతేకాదు..ఇక్కడ బోరున ఏడ్చి కారెక్కిన తరువాత నవ్వుతున్నాడంటూ అక్కడున్నవారు గొణుక్కోవడం కూడా సాజ్ని తల్లి చెవిన పడింది. దీంతో వారు తరుణ్‌పై కేసు నమోదు చేశారు. కానీ అప్పటినుంచి తరుణ్ పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు.
15సంవత్సరాల తరువాత కేసును ఎలా ఛేదించారు
నిజానికి ఈ హత్య కేసు పదిహేను సంవత్సరాల తరువాత ఛేదించడమే విశేషం. ఇందుకు సాజ్ని తల్లి దండ్రులు పెద్దపోరాటమే చేశారు. తరుణ అరెస్ట్ అనంతరం మాట్లాడుతూ రాజకీయాల్లో చేరకు ముందు నుంచే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాగా తెలుసుననీ, ఆయన తరచుగా తమ ఇంటికి కూడా వచ్చేవారని రమణి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే సాజ్ని హత్య జరిగాక దాదాపు ఆరేళ్ల తరువాత తమకు అత్యంత సన్నిహితుడి ద్వారా మోదీని పలుమార్లు కలిసి, తమకు న్యాయం చేయాల్సిందిగా అభ్యర్థించామని కృష్ణన్, రమణి దంపతులు వివరించారు.
దీంతో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎకె శర్మ , డీసీపి హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో 6 సంవత్సరాల సుదీర్ఘ విచారణ ప్రారంభమైంది. ఆ తరువాత డీసీపీ దీపన్ భద్రాన్ ఆధ్వర్యంలోని బృందం చాకచక్యంగా తరుణ్ ఆట కట్టించింది. తరుణ్ తల్లికి వచ్చిన దాదాపు లక్ష ఫోన్ కాల్స్‌ను పరిశీలించామని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక పోలీసు కమిషనర్ జేకే భట్ చెప్పారు.
వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఫిబ్రవరి 14న హత్య
గర్ల్‌ఫెండ్‌కు వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా భార్య హత్య చేసినట్టుగా పోలీసులు విచారణలో తేలింది. భార్యను హత్య చేసిన అనంతరం గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేశాడు తరుణ్. కానీ హంతకులతో తనకు స్నేహం అక్కరలేదని ఖరాకండిగా తేల్చి చెప్పిందట ఆమె.
Comments
Please login to add a commentAdd a comment