
మోదీ.. ‘పీ’ అండ్ ‘ఎన్’ ఫార్ములా..!
ప్రధాని మోదీ కొద్ది రోజుల్లో మంత్రి వర్గాన్ని పునర్‌వ్యవస్థీకరణ వార్తలు వచ్చాయి.
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కొద్ది రోజుల్లో మంత్రి వర్గాన్ని పునర్‌వ్యవస్థీకరణ వార్తలు వచ్చాయి. అందులో భాగంగా శుక్రవారం ఉదయం ఐదుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రధానికి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. అయితే, మంత్రులను రాజీనామా చేయమరని కోరడానికి ప్రధాని ప్రత్యేక ఫార్ములాను వినియోగించినట్లు తెలిసింది. అదే పీ అండ్ ఎన్ ఫార్ములా.
ఏంటీ ఫార్ములా..?
ప్రధాని మోదీ తన మంత్రి వర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్న అనంతరం.. ప్రత్యేకంగా ఒక ఎక్సెల్ షీట్ రూపొందించుకున్నారు. అందులో మంత్రివర్గంలోని ప్రతి మంత్రి పేరు పొందుపరిచారు. ప్రతి ఒక్కరి పనితీరుకు సంబంధించిన విశ్లేషణ చేసే సమయంలో.. పీ(P) లేదా ఎన్(N) అని మోదీ రాశారని తెలిసింది. పీ అక్షరం పడ్డ మంత్రులు మంత్రివర్గంలో కొనసాగుతారని, ఎన్ అనే అక్షరం పడ్డవారే ఇప్పుడు రాజీనామా చేశారని సమచారం.
పీ అండ్ ఎన్ అంటే..!
చాలామందికి అంతు పట్టని ఈ ఫార్ములా చాలా చిన్నదే.. ‘పీ’ అంటే.. పాజిటివ్.. ‘ఎన్’ అంటే నెగిటివ్ అని అర్థం. కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో.. ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. కేంద్రమంత్రుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాజీనామా చేసిన వారిలో రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఉమా భారతి, కల్ రాజ్ మిశ్రా, ఫగ్గన్ సింగ్, సంజీవ్ బలియన్, మహేంద్ర పాండేలు ఉన్నారు.
నిర్మలా సీతారామన్, మహేంద్ర పాండే, గిరిరాజ్ సింగ్‌లు కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. శనివారం కేబినెట్ విస్తరణ జరుగనుండగా.. జేడీయూ నుంచి ఒకరు లేదా ఇద్దరికి మంత్రి పదవులు లభించనున్నాయి. కాగా, రాజీనామా చేసిన మంత్రుల స్థానాన్ని జేడీయూ, అన్నాడీఎంకేకి చెందిన నేతలతో భర్తీ చేయాలని ఎన్‌డీఏ భావిస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుత మంత్రుల్లో ఐదుగురికి పదోన్నతి లభించనుందని సమాచారం. పనితనం ఆధారంగా ఈ ప్రయోషన్లు దక్కనున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, సదానంద గౌడ, మేనకా గాంధీల శాఖలు మారే అవకాశముందని సమాచారం. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్‌లకు పదోన్నతి దక్కతుందని అంటున్నారు. గడ్కరీకి రైల్వే శాఖ అప్పగించి.. సురేష్ ప్రభుకు పర్యావరణ శాఖను అప్పజెప్పనున్నారని తెలుస్తోంది.
అదనపు బాధ్యతలు మోస్తున్న పలువురు కేంద్రమంత్రులకు విస్తరణలో ఉపశమనం లభించనుంది. కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. రాజీవ్ ప్రతాప్ రూడీకి బిహార్ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. మహేంద్ర పాండేను ఇప్పటికే యూపీ బీజేపీ చీఫ్‌గా నియమించారు. కల్ రాజ్ మిశ్రా వయసు 75 ఏళ్లు దాటడంతో ఆయన్ను గవర్నర్‌గా పంపే అవకాశముంది.