న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మాక్సిస్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరంను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 6 గంటలపాటు విచారించింది. ఈడీ ఎదుట చిదంబరం హాజరవడం ఇదే తొలిసారి. ఈడీ సమన్లు జారీ చేయడంతో మంగళవారం ఉదయం లాయర్‌తో కలసి ఈడీ ప్రధాన కార్యాలయానికి చిదంబరం వచ్చారు.
విచారణ అనంతరం మధ్యాహ్నం ఆయనకు భోజన విరామం ఇచ్చారు. తర్వాత 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విచారణ కొనసాగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద చిదంబరం వాంగ్మూ లం నమోదు చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. రూ.3,500 కోట్ల ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంను ఈడీ విచారించింది.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండానే విచారణ
‘ఈడీ ఎదుట హాజరయ్యాను. అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాను. ప్రభుత్వం వద్ద ఉన్న పత్రాల్లోని ప్రశ్నలే అడిగారు. సమాధానాలు కూడా ప్రభుత్వ పత్రాల్లోనే ఉన్నాయి. నాపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. నేరారోపణ జరగలేదు. కానీ నాకు వ్యతిరేకంగా, నన్ను పిలిపించి విచారణ జరుపు తున్నారు’ అని చిదంబరం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
జూలై 10 వరకు అరెస్టు చేయొద్దు
ఈ కేసుకు సంబంధించి తనను అరెస్టు చేయకుండా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విషయంలో చిదంబరంనకు ఊరట లభించింది. జూలై 10 వరకు చిదంబరంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment