న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం తీహార్‌లోని జైలులో మొదటిరోజు నిద్రలేని రాత్రి గడిపారు. కొత్త వాతావరణంలో సరిగా నిద్రపోలేకపోయారు. కోర్టు ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్ కస్టడీ పెంచడంతో ఆయనను గురువారం ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. తన కుమారుడు కార్తీ గతేడాది 12 రోజులు గడిపిన ఏడో నంబరు జైలు గదిలోనే ఆయన్ని ఉంచారు. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు 74 ఏళ్ల చిదంబరానికి ప్రత్యేక గదిని కేటాయించి కొన్ని సదుపాయాలు కల్పించారు.
గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత తలగడ, దుప్పటి అందజేశారు. జైలు గది బయట వాకింగ్ చేసేందుకు శుక్రవారం ఉదయం ఆయనకు అధికారులు అనుమతిచ్చారు. తర్వాత అల్పాహారం, తేనీరు అందించారు. అల్పాహారంగా అంబలి తీసుకున్నట్టు సమాచారం. ఇతర ఖైదీల్లాగే చిదంబరం కూడా లైబ్రరీని వాడుకోవచ్చనీ, నిర్దేశిత సమయంలో టీవీ చూడవచ్చని జైలు అధికారులు వెల్లడించారు. దినపత్రికలు కూడా అందిస్తామన్నారు. ఈరోజు చిదంబరాన్ని ఆయన న్యాయవాది జైలులో కలిసే అవకాశముందని వెల్లడించారు. (చదవండి: తీహార్ జైలుకు చిదంబరం)
Comments
Please login to add a commentAdd a comment