
'మేమూ భారత్‌ను ప్రేమిస్తాం, ద్వేషించం'
భారత్‌లో పెరిగిపోతున్న మత ఛాందసవాదుల అరాచకాలకు వ్యతిరేకంగా ‘మేము పాకిస్తాన్‌ను ద్వేషించం’ అంటూ ముంబైకి చెందిన ఆర్టిస్ట్ రామ్ సుబ్రహ్మణ్యం సోషల్ మీడియాలో చేపట్టిన ప్రచారోద్యమం ఊపందుకొంది.
ఇస్లామాబాద్: భారత్‌లో పెరిగిపోతున్న మత ఛాందసవాదుల అరాచకాలకు వ్యతిరేకంగా ‘మేము పాకిస్తాన్‌ను ద్వేషించం’ అంటూ ముంబైకి చెందిన ఆర్టిస్ట్ రామ్ సుబ్రహ్మణ్యం సోషల్ మీడియాలో చేపట్టిన ప్రచారోద్యమం ఊపందుకొంది. సరిహద్దుకు ఆవల పాకిస్తాన్ నుంచి అదే రీతిన ‘మేము భారత్‌ను ధ్వేషించం’ అంటూ సోషల్ మీడియాలో సందేశాలు కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. పాకిస్తాన్ సాహిత్య సంస్కృతిని ప్రోత్సహించేందుకు లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసిన ‘చాయ్‌చాక్’ అనే సామాజిక సంస్థ ఈ ఉద్యమంలో ముందుంది.
‘మేము పాకిస్తాన్ పౌరలమైనందకు గర్వపడుతున్నాం. ముస్లింలమైనందకూ గర్వపడుతున్నాం. మేము భారత్‌ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాం అని కొందరు....మేము పాక్ పౌరులమైనందకు గర్విస్తున్నాం. అల్లాను నమ్ముతాం. భారత్‌ను ప్రేమిస్తాం. ఎందుకంటే ఒకప్పుడు మేమంతా భారతీయులమే....అంటూ మరికొందరు ప్లేకార్డులను ప్రదర్శిస్తూ సోషల్ వెబ్‌సైట్లలో తమ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. చరిత్రాత్మకంగా సాహిత్య, సంస్కృతి రంగాల్లో భారత, పాకిస్థాన్ దేశ ప్రజలది విడదీయలేని అనుబంధమని, నేడు ఆ సాహిత్య సంస్కృతులను కొనసాగిస్తూ ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింతగా బలపడాలని నిజంగా కోరుకుంటున్నామని ‘చాయ్‌చాక్’ వ్యవస్థాపకుడు అసద్ షబ్బీర్ వ్యాఖ్యానించారు.
ముంబై నగరంలో ప్రముఖ పాకిస్తానీ గజల్ సింగర్ గులామీ అలీ కచేరి రద్దుకు, ఖుర్షీద్ మహమ్మద్ కసూరి పుస్తకావిష్కరణ సభలో నిర్వాహకుడు సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తల సిరా దాడి నేపథ్యంలో ఆర్టిస్ట్ సుబ్రహ్మణ్యం ఈ ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టారు.