'ఎంజీఆర్ బాటలో పన్నీర్ సెల్వం'
చెన్నై: రోజురోజుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మద్ధతు పెరిగిపోతుండగా అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు కష్టాలు రెట్టింపవుతున్నాయి. పన్నీర్ వర్గంలో అన్నాడీఎంకే మాజీ ఎంపీ, సీనియర్ నేత రామరాజన్ చేరిపోయారు. నేటి ఉదయం చెన్నైలో పన్నీర్ సెల్వాన్ని తన మద్ధతుదారులతో ఆయన కలుసుకుని మద్ధతు ప్రకటించారు. 'అమ్మ' జయలలిత వీర విధేయుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమే తమ పార్టీ నేత అని తెలిపారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ బాటలో పన్నీర్ నడుచుకుంటున్నారని కొనియాడారు. ఎంజీఆర్ వారసత్వాన్ని జయ అందిపుచ్చుకున్నట్లుగా, జయ అనంతరం ఆమె రాజకీయ వారసత్వాన్ని పన్నీర్ సెల్వం కొనసాగించాలని నటుడు, మాజీ ఎంపీ రామరాజన్ ఆకాంక్షించారు.
ఆదివారం ఉదయం అన్నాడీఎంకే ఎంపీలు బి. సెంగొట్టువన్, జె. జెయసింగ్ చిన్నమ్మ శశికళను కాదని పన్నీర్ సెల్వాన్ని నేరుగా కలిసి తమ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. క్యాంపు రాజకీయాలు నడిపినా శశికళపై పార్టీ నేతల్లో విశ్వాసం అంతగా లేదని స్పష్టమవుతోంది. దాంతో శనివారం సాయంత్రం గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేలతో శశికళ భేటీలోనూ ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 20 మంది ఎమ్మెల్యేలు తాము పన్నీర్ కే మద్ధతు ఇస్తామని చెప్పగా.. శశికళకు చెందిన మన్నార్ గుడి వర్గం సీఎం అభ్యర్థిగా ప్రిసీడియం చైర్మన్ సెంగొట్టయన్ ను ప్రతిపాదిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
తమిళ రాజకీయాలపై మరిన్ని కథనాలు