ఓడినా బుసలు కొడుతున్న పన్నీర్!
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి నేటి బలపరీక్షతో పూర్తిగా తెరపడింది. సీఎం కుర్చీ కోసం జరిగిన పోరులో అమ్మ జయలలిత వీర విధేయుడు, మాజీ సీఎం ఓ.పన్నీర్ సెల్వం ఓటమి పాలయ్యారు. అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో సీఎం ఎడపాటి పళనిస్వామి విజయం సాధించగా.. పన్నీర్ మాత్రం కుర్చీ పోరులో ఓటమిని జీర్ణించు కోలేకపోతున్నారు. నేడు సభలో జరిగిన బలపరీక్ష అప్రజాస్వామికమని, న్యాయబద్ధం కాదన్నారు. డీఎంకే ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించివేశారని, సభ జరిగేతీరు ఇలాగేనా అని ప్రశ్నించారు. ఆపై జరిగిన ఓటింగ్ ద్వారా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అమ్మ జయలలితకు ద్రోహం చేశారని విమర్శించారు. అమ్మ ఆశయాలకు వ్యతిరేకంగా సభలో నిర్ణయం వెలువడిందని పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. తనకు మద్ధతుగా ఓటేసిన 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అమ్మకు, ఆమె ఆశయాలకు విధేయులని చెప్పారు.
తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గి 13వ సీఎంగా తన పీఠాన్ని ఖరారు చేసుకున్న పళనిస్వామి మాత్రం ఇది ప్రజాస్వామ్య విజయమని చెప్పారు. బలపరీక్షలో నెగ్గిన పళనిస్వామి, మంత్రి వర్గసహచరులు, ఎమ్మెల్యేలతో కలిసి అమ్మ సమాధి వద్దకు వెళ్లి మరోసారి నివాళులర్పించారు. అమ్మ సమాధి వద్ద సీఎం పళనిస్వామి కన్నీరు పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ జయ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే పన్నీర్ వర్గీయులు ఓటమి పాలయ్యారని ఎద్దేవా చేశారు. తన విజయాన్ని.. అమ్మకు నిజమైన మద్ధతుదారులు, అభిమానుల విజయంగా అభివర్ణించారు. ఆయన మద్ధతుదారులు, పార్టీ కార్యకర్తలు 'అమ్మ గెలించింది' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.