చర్చ కాదు..రచ్చే! | Parliament session from tomorrow | Sakshi
Sakshi News home page

చర్చ కాదు..రచ్చే!

Published Sun, Apr 24 2016 1:23 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

చర్చ కాదు..రచ్చే! - Sakshi

చర్చ కాదు..రచ్చే!

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
♦ ఇష్రత్ జహాన్ అఫిడవిట్ మార్పే అస్త్రంగా బీజేపీ
♦ ఉత్తరాఖండ్‌పై బీజేపీని నిలదీయనున్న కాంగ్రెస్
 
 న్యూఢిల్లీ: రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు వాడివేడీగా జరగనున్నాయి. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన,ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసు పార్లమెంట్‌ను కుదిపేయనున్నాయి. ఇషత్‌జ్రహాన్ కేసులో అఫిడవిట్ మార్పును కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రభావితం చేశారంటూ బీజేపీ ఆరోపించనుండగా... ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. హోంశాఖ మాజీ మంత్రి పి.చిదంబరంపై ఆరోపణలతో కాంగ్రెస్‌ను బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేయనుంది. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రపతి పాలనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో అధికారపక్షంపై యుద్ధానికి సిద్ధమైంది. ఈ సమావేశాల్లో వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లు, విరోధి ఆస్తి బిల్లు, రైల్వే కేటాయింపుల బిల్లు, అటవీ పెంపక నిధి బిల్లులు ప్రధానంగా చర్చకు రానున్నాయి. సోమవారం ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాలు మే 13 వరకూ జరుగుతాయి.

 లోక్‌సభలో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపు డిమాండ్లపై చర్చ, రాజ్యసభలోను కొన్ని మంత్రిత్వ శాఖలపై చర్చ, రైల్వే కేటాయింపులు, ఆర్థిక బిల్లు 2016పై చర్చ, ఆమోదం సమావేశాల ప్రధాన అజెండా అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరాఖండ్ ద్రవ్య వినిమయ (ఓటాన్ అకౌంట్) ఆర్డినెన్స్ 2016, విరోధి ఆస్తుల రెండో ఆర్డినెన్స్ (సవరణ, ధ్రువీకరణ)2016లు అజెండాలో ఉన్నాయని శనివారం వెల్లడించింది.

 లోక్‌సభలో...
 రాజ్యసభ ఆమోదించిన సిక్ గురుద్వారాలు(సవరణ) బిల్లు 2016పై లోక్‌సభలో చర్చ జరగనుంది. ఫ్యాక్టరీల(సవరణ) బిల్లు 2014, విద్యుత్ సవరణ  బిల్లు 2014, లోక్ పాల్, లోకాయుక్తలు, సంబ ంధిత చట్టం(సవరణ)2014 పై కూడా చర్చిస్తారు. మూసివేత, దివాళా కోడ్ 2015, బినామీ కార్యకలాపాలు(నిరోధం) సవరణ బిల్లు 2015, వినియోగదారుల హక్కుల పరిరక్షణ బిల్లు 2015లు కూడా జాబితాలో ఉన్నాయి.

 రాజ్యసభలో... లోక్‌సభ ఆమోదించిన రాజ్యాంగ తీర్పు(షెడ్యూల్డ్ కులాలు) సవరణ బిల్లు 2016, కేటాయింపుల యాక్ట్స్( పునరుద్ధరణ) 2016, విరోధి ఆస్తుల బిల్లు(సవరణ, ధ్రువీకరణ) 2016, విజిల్ బ్లోవర్స్ పరిరక్షణ (సవరణ) బిల్లు 2015లు రాజ్యసభలో చర్చకు వస్తాయి. అలాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్( సవరణ) బిల్లు 1987, భూసేక రణలో సరైన పరిహారం హక్కు, పునరావాసం బిల్లు(సవరణ) 2015 వంటివి ఉన్నాయి.

  ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకూ జరిగిన  మొదటి విడత సమావేశంలో రెండు సభలు 16 సార్లు సమావేశమవగా లోక్‌సభలో 11 బిల్లుల్ని, రాజ్యసభలో ఒకటి ప్రవేశపెట్టారు. లోక్‌సభ తొమ్మిది బిల్లుల్ని ఆమోదించగా, రాజ్యసభ 11 బిల్లుల్ని ఆమోదించింది. పది బిల్లుల్ని రెండు సభలు ఆమోదించాయి. రియల్ ఎస్టేట్(అభివృద్ధి, నియంత్రణ) బిల్లు 2016, ఎన్నికల చట్టాలు(సవరణ) బిల్లు 2016 అందులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement