
పనాజీ: బీజేపీ ప్రభుత్వాన్ని నాజీ పాలనతో పోల్చే వారు ముందుగా యూరోప్ చరిత్ర చదవాలని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ హితవు పలికారు. పోర్చుగీసు హయాంనాటి భారత వ్యతిరేక భావజాలం మళ్లీ గోవాలో తలెత్తుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన గోవా లిబరేషన్ డే వేడుకల్లో పారికర్ పాల్గొని ప్రసంగించారు. కొంతమంది కావాలనే తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ పాలనను నాజీ పాలనతో పోల్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల చరిత్రను చదివి అప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించాలని సూచించారు. అలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మనం ఇతరుల తప్పులను ఒక వేలుతో సూచిస్తే మిగతా నాలుగు వేళ్లు మన వైపు సూచిస్తాయన్నారు. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ వెలువరించే ఒక మేగజైన్‌లో బీజేపీ పాలనను నాజీ పాలనతో పోలుస్తూ వ్యాసం వచ్చింది. ఆ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. దుష్ప్రచారం చేస్తున్న వారిని పట్టించుకునే సమయం ప్రభుత్వానికి లేదన్నారు. గోవా అభివృద్ధే తమ ధ్యేయం అని తెలిపారు. పోర్చుగీసు వారి ఆధీనంలో ఉన్న గోవాను భారత సాయుధ బలగాలు 19 డిసెంబర్ 1961న స్వాధీనం చేసుకొన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.