విప్రో ఉద్యోగులకు భారీ హైక్!
న్యూఢిల్లీః దేశంలోనే మూడో అతి పెద్ద సాఫ్ట్ వేర్ సర్వీసెస్ సంస్థ విప్రో... తమ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దేశంలో పనిచేసే ఉద్యోగులకు సగటున 9.5 శాతం వేతన పెంపును జూన్ 1వ తేదీనుంచి అమల్లోకి తేనుంది. అంతేకాక అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన వారికి అదనపు మొత్తాలను కూడ అందజేసింది.
తమ కంపెనీలో పనిచేసే ఆఫ్ షోర్ ఉద్యోగులు వేతనంలో సుమారు 9.5 శాతం పెంపును పొందనున్నారని, ఆన్ సైట్ ఉద్యోగులకు కనీసం 2 శాతం వరకూ పెంపు ఉంటుందని విప్రో ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే పనిలో ప్రత్యేకతను ప్రదర్శించిన వారికి, మంచి నైపుణ్యం ఉన్నవారికి ప్రత్యేక హైక్ కూడ ఇవ్వనున్నట్లు విప్రో తెలిపింది. మార్చి 31 నాటికి తమ పే రోల్ కింద 1,72,912 ఉద్యోగులు ఉన్నారని వెల్లడించింది. విప్రోకు ప్రధాన పోటీదారులైన ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు 6 నుంచి 12 శాతం పెంపును ప్రకటించింది. అలాగే దేశంలో మరో పెద్ద సాఫ్ట్ వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడ తమ ఉద్యోగులకు ఈ సంవత్సరంలో 8 నుంచి 12 శాతం వేతన పెంపును ప్రకటించింది.