గాంధీ స్థానంలో మోదీ
ముంబై: ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీఐసీ) కొత్త ఏడాది కేలండర్, డైరీలపై ఖాదీకి మారుపేరైన జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మను పక్కనపెట్టి ప్రధాని మోదీ బొమ్మను అచ్చేసింది. కుర్తా, ఓవర్‌కోటు దుస్తుల్లో ఉన్న మోదీ రాట్నంతో నూలు వడుకుతున్న చిత్రాన్ని పంచవన్నెలతో ప్రచారంలోకి తెచ్చింది. వీటిలో ఎక్కడా గాంధీ బొమ్మ లేకపోవడం విశేషం. వీటిని చూసి ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయ ఉద్యోగులు కొందరు నోరెళ్లబెట్టారు. గురువారం ముఖాలకు నల్లగుడ్డలు కట్టుకుని మౌన నిరసన తెలిపారు. గాంధీ చిత్రాలతో వీటిని పునర్ముద్రించాలని డిమాండ్ చేశారు. మోదీ బొమ్మ ముద్రణను కేవీఐసీ చైర్మన్ వినయ్ సమర్థించుకున్నారు.