
దావోస్ : ప్రపంచ ఆర్థిక వేదికపై (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) చెప్పడానికి ప్రధాని నరేంద్రమోదీ వద్ద గొప్ప కథ ఉందని, అది భారత్‌వైపు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుందని స్పైస్ జెట్ చీఫ్ అజయ్ సింగ్ అన్నారు. ఆ కథను నరేంద్రమోదీ కంటే ఎవరు కూడా గొప్పగా చెప్పలేరని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ హయాంలో గొప్పగా తీసుకొచ్చిన సంస్కరణలు అయిన జీఎస్‌టీ, డిజిటలైజేషన్, పెద్ద నోట్ల రద్దువంటి అంశాలన్నీ కూడా ఆయన ప్రపంచ వేదికపై వివరించబోతున్నారన్నారు.
ప్రపంచంలో మరే దేశ నేతకు లేనంత అవకాశం మోదీకి ఉందని, ఆయన మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడం ఖాయం అని చెప్పారు. సంస్కరణల భారతం, 1.4బిలియన్ల భారతీయులు, యువ జనాభా, ప్రపంచానికి భారత్ అతిపెద్ద మార్కెట్‌వంటి అంశాలన్నీ కూడా మోదీ ప్రస్తావించనున్నారన్నారు. ప్రపంచ దేశాల అధినేతలతోపాటు ప్రధాని మోదీ కూడా దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)లో ప్రసంగించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్‌కు చెందిన ఓ ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొననుండటంతో ఇది భారత్‌కు అతి ముఖ్యమైన కార్యక్రమంగా నిలవనుంది.
'గత ఏడాది జీ జిన్‌పింగ్‌ను చూసినప్పుడు మనందరి ఫోకస్ చైనాపైనే ఉంది. కానీ, ఈసారి మాత్రం దృష్టి అంతా భారత్‌పైనే' అని అజయ్ సింగ్ చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం ప్రారంభం కానున్న ఫోరం సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్న విషయం తెలిసిందే. మంగళవారం ఫోరం అధికారిక సెషన్స్‌లో ఆయన ప్రసంగిస్తారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం విశేషంగా చెప్పవచ్చు. చివరిసారిగా, 1997లో అప్పటి ప్రధానమంత్రి ఎచ్‌డీ దేవెగౌడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్నింటికి కూడా భావి ఆర్థిక అవకాశాలు కూడా దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదికపైనే ఆవిష్కృతమవుతాయనీ అంటుంటారు.