న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలోని సమస్యలపై చర్చించేందుకు ఈనెల 20న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో మాట్లాడనున్నారు. వివిధ సేవలను డిజిటల్ రూపంలో అందించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాటైన మూడు లక్షల ఉమ్మడి సేవా కేంద్రాల (సీఎస్‌సీ) ద్వారా రైతులు మోదీతో మాట్లాడవచ్చు. గత కొద్దికాలంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తుండటం తెలిసిందే. శుక్రవారం డిజిటల్ ఇండియా పథకం లబ్ధిదారులతో మాట్లాడుతూ ‘20న ఉదయం 9.30 గంటలకు నేను రైతులతో ముచ్చటిస్తాను. నాతో మాట్లాడే అవకాశాన్ని రైతులకు మీరు (సీఎస్‌సీ ఏజెంట్లు) ఇవ్వాలి’ అని అన్నారు.
రేపు నీతి ఆయోగ్ సమావేశం
మోదీ అధ్యక్షతన ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ పరిపాలక మండలి నాలుగో సమావేశం జరగనుంది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్, జాతీయ పోషకాహార పథకం తదితర ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, సీనియర్ అధికారులు హాజరవుతారు. ‘న్యూ ఇండియా 2022’ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన పనులపై కూడా మండలి సమావేశంలో చర్చిస్తారు.
ఆరెస్సెస్, బీజేపీ నేతలకు మోదీ విందు..
బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లోని కీలక నేతలకు మోదీ శుక్రవారం రాత్రి తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా అనేక మంది ఈ విందుకు హాజరయ్యారు. కాగా దేశంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, భవిష్యత్తు వ్యూహాలు, ఇతర కాషాయ సంస్థలతో ఆరెస్సెస్, బీజేపీల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం తదితరాలపై చర్చించేందుకు సూరజ్‌కుండ్‌లో మూడు రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో బీజేపీ, ఆరెస్సెస్‌లకు చెందిన 60 మంది ఉన్నతస్థాయి నేతలు పాల్గొన్నారు. గురువారం ఇవి ప్రారంభం కాగా, అమిత్ షా శనివారం ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది.
కశ్మీర్‌పై మోదీ ఉన్నతస్థాయి భేటీ
జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. హోం మంత్రి రాజ్‌నాథ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. రంజాన్ మాసంలో మిలిటరీ ఆపరేషన్లను ఆపివేయగా, శుక్రవారంతో ఆ గడువు పూర్తయింది. దీంతో ఆపరేషన్ల నిలిపివేత ఆదేశాలు పొడిగింపుపై సమావేశంలో చర్చించారు.
20న రైతులతో మాట్లాడతా..
Published Sat, Jun 16 2018 2:47 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment