
న్యూఢిల్లీ: వ్యవసాయ సంక్షోభంపై చర్చించేందుకు ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాగు రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలపై చర్చించడంతో పాటు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ఉన్న మార్గాలు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. ‘ది నేషనల్ కాన్ఫరెన్స్ 2022’ పేరిట ఈ సదస్సు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని పుసా కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ప్రధాని మోదీ ఫిబ్రవరి 20వ తేదీన సదస్సులో పాల్గొంటారని వ్యవసాయ కార్యదర్శి ఎస్కే పట్నాయక్ చెప్పారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, నీతి ఆయోగ్ సీనియర్ అధికారులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయించే సీఏసీపీ ప్రతినిధులు, పలు వ్యవసాయ వర్సిటీల పరిశోధకులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కూడా హాజరవుతారు.
ప్రధాని సమక్షంలోనే సిఫార్సులు..
సమావేశం తొలిరోజున వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు.. రైతులు, వ్యవసాయం, అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధో మథనం జరుపుతారు. రెండోరోజు వారు ప్రధాని మోదీ సమక్షంలో తమ సిఫార్సులను వెల్లడిస్తారు. ఇటీవల బడ్జెట్‌లో కనీస మద్దతు ధరలను.. ఉత్పత్తి వ్యయానికి 1.5 రెట్లకు పైగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి రేటు ఈ ఏడాది 4.9 శాతం నుంచి 2.1 శాతానికి పడిపోతుందని గణాంకాలు వెలువడిన నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే రైతులకు రుణమాఫీ, ప్రోత్సాహకాలు వంటివి ప్రకటించాయి.