చెన్నైలో పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించిన జయలలిత విగ్రహం
సాక్షి ప్రతినిధి, చెన్నై: కుటుంబ సంక్షేమానికి మహిళా సాధికారత కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నాలుగేళ్లలో మహిళల పురోగతికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టిందని తెలిపారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత 70వ జయంతి సందర్భంగా మహిళా ఉద్యోగులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు అందించే పథకం ‘అమ్మ టూవీలర్’ను మోదీ శనివారం ఇక్కడ ప్రారంభించారు. ఐదుగురు లబ్ధిదారులకు తాళాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అందించారు.
గవర్నర్ బన్వరీలాల్, సీఎం పళనిస్వామి, డెప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2016 ఎన్నికల్లో జయలలిత ఈ పథకాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దీని ప్రకారం.. స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్న ఉద్యోగినికి మొత్తం వ్యయంలో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సుమారు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన జరుగుతోందని అధికార అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సీఎం, డిప్యూటీ సీఎంలు జయలలిత విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అన్ని పథకాల్లో మహిళలకే ప్రాధాన్యం..
సబ్సిడీ స్కూటర్ల పథకం ప్రారంభించాక మోదీ మాట్లాడారు. కుటుంబంలో ఒక మహిళకు సాధికారత కల్పిస్తే మొత్తం కుటుంబానికి సాధికారత లభిస్తుందని అన్నారు. జయలలిత ఎక్కడున్నా ఈ కార్యక్రమాన్ని చూస్తే ఎంతో సంతోషిస్తారని అన్నారు. తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ..‘తమిళనాడు రాష్ట్రానికి, తమిళ భాషకు, వారసత్వానికి శిరసు వంచి నమస్కరిస్తున్నా’ అని అన్నారు. జయకు నివాళులర్పిస్తూ ఆమెను ‘సెల్వి జయలలిత జీ’ అని సంబోధించారు. ‘మహిళా సాధికారతపై ఎక్కువగా దృష్టిసారిస్తూ అన్ని పథకాల్లోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళా సంక్షేమానికి కట్టుబడి ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించాం. ముద్ర యోజన పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండానే 4.60 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశాం’ అని మోదీ పేర్కొన్నారు.
డామన్ డయ్యూకు రూ. వేయి కోట్ల పథకాలు...
కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యూలో రూ. వేయి కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను కూడా మోదీ ప్రారంభించారు. అలాగే అహ్మదాబాద్–డయ్యూ పట్టణాల మధ్య విమాన సేవలను ఆరంభించారు.మోదీ ప్రారంభించిన పథకాల్లో నీటి శుద్ధి ప్లాంట్, గ్యాస్ పైపులైన్, ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్, మునిసిపల్ మార్కెట్, పాదచారుల వంతెన తదితరాలున్నాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్)లో భాగంగా నిర్మించిన అంగన్‌వాడీ పాఠశాల భవనాలను కూడా మోదీ ఆరంభించారు.
లబ్ధిదారుకు వాహనం ‘కీ’ అందజేస్తున్న మోదీ
Comments
Please login to add a commentAdd a comment