అమెరికాలో క్షణం తీరిక లేకుండా..
వాషింగ్టన్: సాధారణ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి వచ్చినంత సులువుగా విదేశాలను చుట్టిరావడం ప్రధాని నరేంద్ర మోదీ వేగవంతమైన జీవితానికి సోదాహరణ. ప్రస్తుతం ఐదు దేశాల పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం అగ్రరాజ్య రాజధాని వాషింగ్టన్ కు చేరుకున్నారు. భారత ప్రధాని విమానం దిగీదిగగానే ఎయిర్ పోర్టు ప్రాంగణమంతా 'మోదీ.. మోదీ..' నినాదాలతో మారుమోగిపోయింది. మూడు రోజులపాటు అమెరికాలో ఉండనున్న మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు వ్యాపార దిగ్గజాలు, పలువురు ప్రముఖులను కలవనున్నారు.
అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా పలు కార్యక్రమాలకు హాజరైన మోదీ ముందుగా భారత సంతతి వ్యోమగామి, దివంగత కల్పనా చావ్లాకు నివాళులు అర్పించారు. ఎర్లింగ్టన్ జాతీయ స్మారక స్థలిలోని కల్పన సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో చావ్లా కుటుంబసభ్యులతోపాటు మరో భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా పాల్గొన్నారు.
ఎర్లింగ్టన్ నుంచి నేరుగా బ్లేయర్ హౌస్ కు చేరుకున్న నరేంద్ర మోదీ.. అమెరికా విదేశీ వ్యవహారాల నిపుణులు(థింక్ ట్యాంకర్స్)తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతి, భవిష్యత్ అవసరాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటుచేసిన భారత సాంస్కృతిక చిహ్నాల అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్నారు. దశాబద్ధాల కిందట ఇండియాలో చోరీకి గురై అమెరికాకు చేరిన 200 దేవతా మూర్తులను యూఎస్ అటార్నీ జనరల్.. మోదీకి అప్పగించారు.
ఇక మంగళవారం ఉదయం వైట్ హౌస్ లో అధ్యక్షుడు ఒబామాను కలుసుకోనున్న మోదీ అక్కడే లంచ్ చేస్తారు. శాఖాహారి అయిన భారత ప్రధాని కోసం వైట్ హౌస్ చెఫ్ లు ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయనున్నారు. ఆ తరువాత అమెరికా ఉభయసభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. 1949తర్వాత అమెరికా ఉభయసభల్లో ప్రసంగించే ఆరో భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. ఒబామాతో భేటీలో రక్షణ, వ్యాపార అంశాలతోపాటు వాతావరణ మార్పులపై చర్యలు తదితర అంశాలు చర్చిస్తారు. మూడు రోజుల పర్యటన ముగించుకుని అమెరికా నుంచి నేరుగా మెక్సికోకు వెళ్లనున్న ఆయన జూన్ 9న భారత్ కు తిరిగి వస్తారు.